వరంగల్ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదు : సర్వే
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.... ఎన్నికల ప్రచారం సందర్బంగా టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత కనిపించిందని ఆయన గుర్తు చేశారు. అందులోభాగంగా ఆ పార్టీ మంత్రులు, నేతలను ప్రజలు నిలదీశారని అన్నారు.
ఈవీఎంల మానిప్లేట్పై ప్రత్యేక కమిషన్తో బహిరంగ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వే సత్యనారయణ డిమాండ్ చేశారు. ఈవీఎంలు కరెక్ట్ అని తేలితే కేసీఆర్కి సలాం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంలు మానిప్లేట్ అయ్యాయని తేలితే కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నుంచే... టీఆర్ఎస్ ఈవీఎంల మానిప్లేట్ చేయడం ప్రారంభించిందన్నారు. ప్రచారంలో కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. ఉద్యమ కాలంలోనూ టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రాలేదని తెలిపారు. వరంగల్లో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ రావడం.. కాంగ్రెస్కి డిపాజిట్ రాకపోవడానికి కారణం ఈవీఎంలు మానిప్లేట్ చేయడమే అని సర్వే స్పష్టం చేశారు.