నేరేడుచర్ల: రాష్ట్రంలో ఆరు నెలల్లో అసెంబ్లీ రద్దు కావడం ఖాయమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె, కల్లూరు, దాసారం, యల్లారం, ముకుందాపురం, బురుగులతండా, సోమారం, చిల్లేపల్లి, బొడలదిన్నె, జగనతండా గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పూర్తిగా విఫలమైందని, సర్పంచ్‌లను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. గతంలో చేసిన పనుల బిల్లులు ఇప్పటి వరకూ రాకపోవడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె ప్రగతి కార్యక్రమాలకు వెళ్లేందుకు భయపడుతున్నారని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, పింఛన్లు పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల రైతు బంధు ఇస్తామన్నారు. భూమిలేని రైతు కూలీలకు, జాబ్‌కార్డులున్న ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో పాటు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.12వేల చొప్పున అందిస్తామని చెప్పా రు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూస్తామన్నారు. అలాగే రైతులకు పంట బీమాతో పాటు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయాస్తం పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment