
ఏసీబీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నవేళ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయానికి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మెదక్ జిల్లా సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఏసీబీ ఆఫీసుకు వచ్చానని మీడియా ప్రతినిధులతో చెప్పిన చింతా.. మరిన్ని ప్రశ్నలకు బదులు చెప్పేందుకు నిరాకరించారు.
ఓటుకు నోట్లు కేసులో ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఏసీబీ.. తాజాగా ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయిన వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీరర్తన్ను బుధవారం విచారించింది. కాగా, టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కొద్దిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకున్నారనే ఆధారలు సేకరించిన ఏసీబీ.. వారిని కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరిని ప్రశ్నిస్తారనే విషయం తేలకముందే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ఏసీబీ ఆఫీసుకు రావడం రాజకీయవర్గాల్లో గుబులు రేపింది.