ట్విట్టర్‌కు ఏమైంది? | Twitter Chief Operating Officer Flying The Coop | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌కు ఏమైంది?

Published Thu, Nov 10 2016 4:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

ట్విట్టర్‌కు ఏమైంది?

ట్విట్టర్‌కు ఏమైంది?

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు మరో ముఖ్యమైన అధికారి రాజీనామా చేశారు. ఈ క్వార్టర్‌లో నిరాశాజనక ఫలితాలు, ఉద్యోగాల్లో కోతకు తోడు ముఖ‍్య అధికారుల  వరుస రాజీనామాలు ట్విట్టర్‌ను  వెంటాడుతున్నాయి.  ట్విట్టర్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) ఆడమ్‌ బైన్‌ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఆయన స్థానంలో  2014 జూలై  లో ట్విట్టర్ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) నియమితుడైన  ఆంటోనీ నోటో సీఓఓ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. సీఎఫ్‌ఓ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే దాకా నోటో కొనసాగుతారని వివరించింది.   కొన్ని వారాలపాటు బైన్‌ నోటోకు సహాయంగా ఉంటారని తెలిపింది. 2010 లో ట్విట్టర్ లో చేరిన ఆడమ్ అద్భుతమైన  టీం తయారుచేశారని, అంతర్జాతీయంగా వ్యాపారాన్ని  విస్తరించారని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా  నష్టాల కారణంగా గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 9శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలోనే ట్విట్టర్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 3,860 ఉన్న ఉద్యోగుల్లో  350 మందిని తొలిగిస్తు‍న్నట్టు వెల్లడించింది. ఎపుడూ లాభాలను నమోదు చేయని ట్విట్టర్‌ 2017 సం.రంలో తొలిసారిగా లాభాలను నమోదు చేసే దిశగా   పయనిస్తోందని గత ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా   డోర్సే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే  విశ్లేషకులు మాత్రం  సంస్థ సామర్థ్యంపై ఆందోళనలు వ్యక్తంచేశారు మరోవైపు వినియోగదారుల పెరుగుదల కోసం కృషి చేస్తున్న సమయంలో అడ్వర్టైజింగ్‌ బిజినెస్‌ బాగా పెంచిన ఆడమ్‌ ట్విట్టర్‌ను వీడడం కంపెనీకి పెద్ద షాకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్‌ ఇండియా హెడ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు కూడా సంస్థ నుంచి  తప్పుకున్న సంగతి తెలిసిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement