న్యూయార్క్: సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ట్విటర్ ప్రతిపాదిత ఐపీవో ద్వారా 1 బిలియన్ డాలర్లను సమీకరించాలని యోచిస్తోంది. ఈ నిధులను వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ వ్యయాలు మొదలైన వాటికి ఉపయోగించుకోనున్నట్లు ట్విటర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌లో సంస్థ పేర్కొంది. 2013లో పెట్టుబడి వ్యయాలు సుమారు 225-275 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతానికి ఐపీవోకి సంబంధించి ప్రాథమిక దరఖాస్తు ఎస్-1ని సమర్పించనున్నట్లు ట్విటర్ వివరించింది.
కంపెనీ 2011లో 106 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించగా 2012లో ఇది 317 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2011లో నష్టం 128 మిలియన్ డాలర్లు కాగా, 2012లో నష్టం 79 మిలియన్ డాలర్లు. యూజర్ల సంఖ్య వృద్ధి క్రమంగా నెమ్మదిస్తుండటంతో పాటు పలు అంశాల కారణంగా భవిష్యత్‌లో ఆదాయాల వృద్ధి రేటు కూడా కాస్త నెమ్మదించవచ్చని సంస్థ పేర్కొంది. 2006లో ప్రారంభమైన ట్విటర్ యూజర్లు ప్రస్తుతం సగటున మూడు నెలల్లో 218.3 మిలియన్లుగా ఉన్నారు.