వచ్చే నెలలోనే ట్విటర్ ఐపీఓ
న్యూయార్క్: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ట్విటర్... ప్రతిపాదిత పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా 1.6 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.10 వేల కోట్లు)ను సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. వచ్చే నెలలో ఈ ఇష్యూ రానుంది. 17-20 డాలర్ల రేటులో మొత్తం 7 కోట్ల షేర్లను విక్రయించేందుకు వీలుగా ఐపీఓకి రానున్నట్లు అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ)కి తెలిపిన సమాచారంలో ట్విటర్ పేర్కొంది. మరో 1.05 కోట్ల షేర్లను కూడా జారీచేసే అవకాశాన్ని కూడా కంపెనీ అట్టిపెట్టుకుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ‘టీడబ్ల్యూటీఆర్’ సింబల్‌తో తమ స్టాక్స్‌ను లిస్ట్ చేసేందుకు ఆమోదం లభించినట్లు ట్విటర్ తెలియజేసింది. అంతక్రితం బిలియన్ డాలర్లవరకూ సమీకరించనున్నట్లు ట్విటర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, 1.6 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ అంచనా ప్రకారం.. కంపెనీ మార్కెట్ విలువను 10.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.