‘మీనాను ఏసీబీ కార్యాలయానికి రానివ్వొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చీఫ్‌గా ఎంకే మీనాను నియమించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఢిల్లీ హైకోర్టులో శనివారం సవాలు చేసింది. మీనాను ఏసీబీ కార్యాలయానికి రాకుండా, ఆ సంస్థ విధుల్లో జోక్యం చేసుకోకుండా నిలువరిస్తూ ఆదేశాలివ్వాలని మధ్యంతర పిటిషన్ వేసింది. మీనా తనను బెదిరిస్తున్నారని ఆప్ ప్రభుత్వం ద్వారా ఏసీబీగా నియమితులైన ఎస్‌ఎస్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏసీబీ చీఫ్‌ను నియమించే అధికారం మాకే ఉంది.
ఏసీబీలో జాయింట్ కమిషనర్ పోస్టే లేదు. అలాంటప్పుడు ఆ హోదా ఉన్న మీనాను సంస్థ చీఫ్‌గా నియమించడం సరికాదు’ అని వివరించింది. మీనా ఏసీబీ, విజిలెన్స్ అధికారులను బెదిరిస్తున్నారని, పోలీసుల ప్రమేయమున్న అవినీతి కేసులను ఏసీబీ నుంచి ఢిల్లీ పోలీసు విభాగానికి బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. హవాలా కేసులో మీనాపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఆయనను ఆ సంస్థ చీఫ్‌గా నియమించడం సరికాదని పేర్కొంది. కాగా, తాను రూపొందించిన ఆప్ లోగోను అధికారిక కార్యక్రమాల నుంచి ఉపసంహరించుకోవాలని ఆప్ మాజీ కార్యకర్త సునీల్ లాల్.. ఢిల్లీ సీఎం, ఆప్ నేత కేజ్రీవాల్‌కు నోటీసు పంపారు.