పిన్నినీ వదలని 'ఉబెర్' రేపిస్టు!!
ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ అత్యాచార ఘటనలో నిందితుడు శివకుమార్ యాదవ్ అకృత్యాలు ఒక్కోటీ బయటకు వస్తున్న కొద్దీ అతడి విశ్వరూపం బయటపడుతోంది. రెండేళ్ల క్రితం అతడు తన సొంత గ్రామమైన రాంనగర్లో 'పిన్ని' అని పిలిచే మహిళను కూడా వదలకుండా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్నాళ్లూ బయట పెట్టలేక లోలోపలే కుమిలిపోతూ ఉన్నారు. అతడు ఉండే వీధిలోనే తాము కూడా ఉండేవాళ్లమని, శివకుమార్ తనను పిన్ని అని పిలిచేవాడని ఆమె తెలిపారు. అయితే, అతడు తనపై అఘాయిత్యం చేసిన విషయాన్ని బయటపెట్టొద్దని, అలా చేస్తే కుటుంబ పరువు మంటగలిసిపోతుందని భర్త వారించడంతో ఇన్నాళ్లూ ఊరుకున్నానన్నారు. తొలిసారి 2013 ఆగస్టులో అతడు తనను తుపాకితో బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పారు. తాను చెత్త పారబోయడానికి వెళ్లినప్పుడు బలవంతంగా లాగి, నోరు నొక్కేశాడన్నారు.
అయితే.. అలా అతడి చేతుల్లో అత్యాచారాలకు గురై.. బయట పెట్టకుండా ఊరుకున్నవాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. ఇప్పటివరకు శివకుమార్ యాదవ్పై ఆరు అత్యాచారం కేసులు నమోదయ్యాయి. వాళ్లలో గుర్గావ్లోని ఓ బార్ డాన్సర్ కూడా ఉన్నారు. ఆ కేసులో అతడు ఏడు నెలల జైలుశిక్ష అనుభవించాడు.
మరో సందర్భంలో అయితే 18 ఏళ్ల యువతి కాలేజిలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో యాదవ్ చేతిలో అత్యాచారానికి గురైంది. దాంతో ఆమె చదువు ఆపేసింది. తండ్రి ఆమెకు పెళ్లిచేసి వేరే ఊరు పంపేశారు. ఇలాంటి దారుణాలు చాలా ఉన్నాయని రాంనగర్ గ్రామస్థులు చెబుతున్నారు.