
రావణుడిని చంపినట్టు.. వారి తలల్ని నరకాలి
ఆగ్రా: కేంద్ర మంత్రి ఉమా భారతి రేపిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్షమించమని నిందితులు వేడుకునేవరకు, బాధితుల ముందు వారికి చిత్రహింసలు పెట్టాలని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఉమా భారతి మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాచార నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించానని చెప్పారు.
'రేపిస్టులను తల కిందలుగా వేలాడతీసి చిత్రహింసలు పెట్టాలి. గాయాలకు కారం చల్లాలి. ఏడుస్తూ క్షమించమని వేడుకునేవరకు ఇలాగే చేయాలి. ఈ దృశ్యాలను మహిళలు దగ్గర నుంచి చూడాలి' అని ఉమాభారతి అన్నారు. బులంద్‌షార్ అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనీసం ప్రయత్నించలేదని విమర్శించారు. గతేడాది ఢిల్లీకి సమీపంలో హైవేపై వెళ్తున్న వాహానాన్ని ఆపి, తల్లీకూతుళ్లపై సామూహిక లైంగికదాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
పదేళ్ల క్రితం తాను మధ్యప్రదశే్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రేపిస్టులను పోలీస్ స్టేషన్‌లో తలకిందులు వేలాడతీసి చిత్రహింసలు పెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించానని, ఆ దృశ్యాలను కిటికీల ద్వారా చూడాలని మహిళలకు చెప్పానని ఉమాభారతి చెప్పారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేయగా, రాక్షసులకు మానవహక్కులు ఉండవని, రావణుడిని చంపినట్టు వారి తలలను నరికివేయాలని చెప్పానని వెల్లడించారు.