‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్! | Underworld don Dawood Ibrahim to retire on 60th birthday, announce his successor | Sakshi
Sakshi News home page

‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!

Published Fri, Dec 25 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!

‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!

సోదరుడిని వారసుడిగా ప్రకటించనున్న దావూద్!
* 60వ బర్త్‌డే పార్టీలో ప్రకటించే అవకాశం

ముంబై: మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడా?వారసుడిని ప్రకటించనున్నాడా?.. ఈ ప్రశ్నలకు ముంబైలోని ‘డీ’ కంపెనీ సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి.  ‘డీ’ కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. సోదరుడు అనీస్ అహ్మద్‌కు డీ కంపెనీ పగ్గాలు అప్పగించేందుకు దావూద్ నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు డీ గ్యాంగ్ సీఈఓగా ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు చోటా షకీల్ ఇకపైనా అదే బాధ్యతల్లో కొనసాగుతారు.

అనీస్, షకీల్‌లు కలిసి, దావూద్ సలహ సంప్రదింపుల మేరకు ‘డీ’ కంపెనీ మాఫియా బిజినెస్‌ను నిర్వహిస్తారు. పలు దేశాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల అమ్మకం, బెట్టింగ్, హవాలా తదితర కార్యకలాపాల ద్వారా వెయ్యి కోట్ల డాలర్ల(సుమారు రూ. 66 వేల కోట్లు) మాఫియా సామ్రాజ్యాన్ని దావూద్ నిర్మించారు. దావూద్ సోదరుల్లో అనీస్, హుమాయున్, ముస్తఖీమ్.. దావూద్‌తోనే ఉంటున్నారు. వారిలో ముస్తఖీమ్ దీర్ఘకాల వ్యాధితో బాధపడ్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు.

హుమాయున్ ‘డీ’ వ్యవహారాల్లో అంత క్రియాశీలకంగా లేడు. అందువల్ల అనీస్‌కే వారసత్వ పగ్గాలు అప్పగించవచ్చు. దావూద్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఆయన భార్య మెహజబీన్, ఇద్దరు పిల్లలు మహరూఖ్, మొయిన్‌లు ఉండొచ్చని భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడ్తున్న దావూద్‌కు విశ్రాంతి అవసరమన్న ఉద్దేశంతో వారు బాధ్యతలను తగ్గించుకోవాలంటూ దావూద్‌పై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చనుకుంటున్నారు.
 
రహస్యం.. అంగరంగ వైభవం
తన 60వ పుట్టిన రోజును దావూద్ శనివారం కరాచీలో వైభవంగా జరుపుకుంటున్నాడు. వేదిక ఎక్కడ అనేది అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. అతిధులకు కూడా ఆ వివరాలు ఇవ్వడం లేదు. బర్త్‌డే వేడుకలకు కాసేపు ముందు పికప్ చేసుకుంటామని వారికి చెప్పినట్లు సమాచారం.
 
దావూద్ పాక్‌లో ఉండడు!
ముంబై: ‘దావూద్ పాక్‌లో ఉండడు.. తరచుగా పాక్‌కు వస్తాడని వింటుంటాను.’ అని కరాచీకి చెందిన మీడియా గ్రూప్ ‘డాన్’ సీఈఓ హమీద్  పేర్కొన్నారు. ముంబై ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement