
సీమాంధ్ర ప్రత్యేకం
* ప్రత్యేక హోదాకు ఆమోదం.. ప్రధాని ప్రకటన అమలుకు ప్రణాళిక సంఘానికి నిర్దేశం
* కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
* రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో 2 సవరణలకు ఆమోదం..
* పోలవరం గ్రామాలు, ఎన్‌టీపీసీ విద్యుత్ పంపిణీలపై స్పష్టత
* పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు సీమాంధ్రకే
* భద్రాద్రికి దారి ఉండదంటూ జైపాల్‌రెడ్డి అభ్యంతరం
* దీంతో భద్రాచలం పట్టణం, రామాలయం.. భద్రాద్రిని కలిపే బూర్గంపాడులోని 12 రెవెన్యూ గ్రామాలు తెలంగాణలోనే ఉంచాలని కేబినెట్ నిర్ణయం
* ముంపు బాధితులకు సొంత మండలాల్లో భూ కేటాయింపు
* ఎన్‌టీపీసీ విద్యుత్‌లో 85% గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పంపిణీ
* మిగతా 15% గత వినియోగం ఆధారంగా రెండు రాష్ట్రాలకు
* ఈ సవరణలపై ఆర్డినెన్స్ తెచ్చే బాధ్యత వచ్చే ప్రభుత్వానిదే
* త్వరలో అపాయింటెడ్ డే ప్రకటన, కమిటీల పని నేటి నుంచి..
* 3 రోజుల్లో సీమాంధ్ర కొత్త రాజధానిపై నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం మిగిలే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు ప్రత్యేక హోదా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘానికి మంత్రిమండలి ఆదేశించింది. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశం.. రాష్ట్ర విభజనకు సంబంధించి - ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ముంపు ప్రాంతాల బదిలీ, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి వచ్చే విద్యుత్ పంపిణీ - మూడు అంశాలపై స్పష్టత ఇచ్చింది.
ఖమ్మం జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఊరట కలిగించేలా.. నిర్వాసితులకు సొంత మండలంలోనే భూమికి బదులు భూమి లభించేలా పునరావాస ప్యాకేజీ అమలుచేయాలని నిర్ణయించింది. ఇందుకు మండలాలను యూనిట్‌గా తీసుకుని నిర్వాసిత ప్రాంతాలనుసమాంధ్రలో కలపాలనే నిర్ణయానికి మంత్రిమండలి సభ్యులు నిర్ణయించారు. అయితే భద్రాచలానికి దారినిచ్చే బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను, భద్రాచలం పట్టణాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించారు. అలాగే.. రాష్ట్రంలోని రెండు కేంద్ర విద్యుత్ సంస్థలు (ఎన్‌టీపీసీ) ఉత్పత్తి చేసే 4,100 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతాన్ని గాడ్గిల్ ఫార్ములా ప్రకారం, మిగతా 15 శాతం విద్యుత్‌ను గత ఐదేళ్ల సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
పోలవరం ముంపు ప్రాంతాలు, ఎన్‌టీపీసీ విద్యుత్తు అంశాలపై స్పష్టత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి రెండు సవరణలు చేయాలన్న నిర్ణయాలను ఆమోదించింది. ఈ సవరణలతో ఆర్డినెన్స్ తేవాల్సి ఉన్నప్పటికీ.. దానిపై నిర్ణయం తీసుకోలేదు. తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వమే ఈ సవరణలను ఆర్డినెన్స్ ద్వారా గానీ, పార్లమెంటు ద్వారా గానీ ఆమోదించాల్సి ఉంటుంది. సీమాంధ్రకు ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పరిపాలనాపరమైనది కావటంతో దాని కోసం విభజన చట్టానికి సవరణ చేయనవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది.
ముంపు, పునరావాసం.. సీమాంధ్రలోనే...
కేంద్ర కేబినెట్ భేటీకి రాష్ట్రానికి చెందిన కేబినెట్ మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ కూడా హాజరయ్యారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న అంశం చర్చకు వచ్చినప్పుడు జైపాల్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంతకుముందు సమావేశాల్లో ఈ అంశాన్ని వ్యతిరేకించినప్పుడు భద్రాచలం పట్టణం, రామాలయం మినహా ఏడు మండలాల్లోని పలు రెవెన్యూ గ్రామాలను మాత్రమే బిల్లులో చేర్చారు. కేవలం ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలంటే సీమాంధ్ర రాష్ట్రానికి కష్టమవుతుందన్న అక్కడి ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు... నిర్వాసితుల పునరావాసం విషయంలో అవసరమైన అన్ని చర్యలు కేంద్రం తీసుకుంటుందని రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి ఒక ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో రెవెన్యూ గ్రామాలను కాకుండా మండలాలను పూర్తిగా ఇస్తే భూమికి బదులు భూమి సొంత మండలంలోనే ఇవ్వొచ్చని కేంద్రం భావించింది. ఈ నిర్ణయాన్ని జైపాల్‌రెడ్డి తప్పుపట్టారు. మండలాలన్నీ ఇచ్చేస్తే భ ద్రాచలం పట్టణానికి తెలంగాణకు అనుసంధానం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీంతో అనుసంధానానికి అవసరమైన బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. సీమాంధ్రకు ఇచ్చిన తరహాలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని జైపాల్‌రెడ్డి కేబినెట్ భేటీలో కోరినట్లు సమాచారం. అయితే దీనిపై కేబినెట్ స్పందించలేదని తెలిసింది.
ప్రత్యేక ప్యాకేజీ అమలుకు ప్రణాళికా సంఘానికి నిర్దేశం
కేబినెట్ భేటీ అనంతరం.. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యుడు జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని, దీనిని అమలు చేయాల్సిందిగా ప్రణాళికా సంఘానికి నిర్దేశించిందని తెలిపారు. ప్రణాళికా సంఘం పాలనా విభాగమని.. కేంద్ర సాయం ప్రణాళికా సంఘం ద్వారానే అందుతుందని ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనలో సీమాంధ్రకు పన్ను ప్రోత్సాహకాల వంటి ఆరుసూత్రాల అభివృద్ధి ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. ఇందులో రాయలసీమ నాలుగు జిల్లాలకు, ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలు కూడా ఉంటాయన్నారు.
సొంత మండలంలోనే భూమికి బదులు భూమి...
‘‘పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గుంపాడు (రెవెన్యూ గ్రామాలు పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెండి, మోతెపట్టినగర్, ఉప్పుశాక, నకిరీపేట, సోంపల్లి గ్రామాలు మినహా), భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు ఖమ్మం నుంచి సీమాంధ్రకు వెళతాయి. భద్రాచలం టౌన్, రామాలయం తెలంగాణలో ఉంటాయి. దీనివల్ల ముంపు బాధితులు భూమికి బదులు భూమి సొంత మండలంలోనే పొందుతారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తుంది. ముంపు ప్రాంతం, పునరావాస ప్రాంతం రెండూ సీమాంధ్రలోనే ఉంటాయి...’’ అని జైరాం వివరించారు.
ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపితే వాళ్లు ఏ రాష్ట్రానికి ఓటర్లు అవుతారని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘2014 ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ప్రస్తుత డిలిమిటేషన్ ప్రకారమే జరుగుతాయి. అంటే 2014 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా గతంలో జరిగిన రీతిలోనే జరుగుతాయి’’ అని ఆయన స్పష్టం చేశారు.
గాడ్గిల్ ఫార్ములా ప్రకారం కేంద్ర విద్యుత్ పంపిణీ...
విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ విద్యుత్తు పంపిణీ విషయంపై జైరాం రమేశ్ మాట్లాడుతూ ‘‘విద్యుత్తు పంపిణీపై విభజన బిల్లులో కొంత అస్పష్టత ఉంది. అందువల్ల దీనిపై కేబినెట్ ఇప్పుడు స్పష్టత ఇచ్చింది. కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థల నుంచి వచ్చే విద్యుత్తును గడిచిన ఐదేళ్ల వాస్తవ వినియోగం ఆధారంగా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని బిల్లులో చెప్పింది. అంటే ఎన్‌టీపీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు ఇది. అయితే కేబినెట్ ఇప్పుడు దీనిపై స్పష్టత ఇచ్చింది. కేటాయింపులు జరపని విద్యుత్తులో 15 శాతం మాత్రమే గడచిన ఐదేళ్ల వాస్తవ వినియోగం ఆధారంగా ఉంటుంది. ఉత్పత్తి అయిన 85 శాతం విద్యుత్తు గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా పంపిణీ అవుతుంది’’ అని వివరించారు.
రాష్ట్రంలో కేంద్ర విద్యుత్ సంస్థలు (ఎన్‌టీపీసీకి చెందిన విద్యుత్ ప్లాంట్లు) రెండు ఉన్నాయి. రామగుండంలో 2,100 మెగావాట్ల ప్లాంటు, విశాఖపట్నం సమీపంలో 2,000 మెగావాట్ల సింహాద్రి విద్యుత్ ప్లాంటు ఉన్నాయి. ఇవి ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌లో 15 శాతం విద్యుత్‌ను ఎవరికీ కేటాయించకుండా కేంద్రం తన వద్ద ఉంచుకుంటుంది. దీనినే అన్-అలొకేటెడ్ కోటాగా వ్యవహరిస్తారు. రెండు ప్లాంట్ల 4,100 మెగావాట్లలో ఇది 615 మెగావాట్లుగా ఉంటుంది.
సాధారణంగా ఈ విద్యుత్‌ను విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాలకు అవసరాన్ని బట్టి కేంద్రం కేటాయిస్తుంది. అయితే.. తాజాగా ఈ 15 శాతం విద్యుత్‌ను తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు గత ఐదేళ్ల సగటు వినియోగం ఆధారంగా కేటాయించనున్నట్లు జైరాం తెలిపారు. ఈ ప్రకారం చూస్తే.. అన్-అలొకేటెడ్ కోటా నుంచి తెలంగాణకు 55 నుంచి 60% విద్యుత్, సీమాంధ్రకు 40 నుంచి 45% విద్యుత్ వచ్చేఅవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక మిగిలిన 85 శాతం విద్యుత్‌ను గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా రెండు రాష్ట్రాలకు కేటాయిస్తామని జైరాం చెప్పారు. గాడ్గిల్ ఫార్ములా అంటే.. ఆ రాష్ట్రం ప్రణాళిక బడ్జెట్, సగటు విద్యుత్ వినియోగం, వ్యవసాయ విద్యుత్ డిమాండ్, విద్యుత్ సంస్కరణల అమలు, ప్రభుత్వ సబ్సిడీ విడుదల.. ఈ ఐదు అంశాల ఆధారంగా విద్యుత్‌ను కేటాయిస్తారు. ఈ ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎంతెంత విద్యుత్ కేటాయించాలనే లెక్కలు వేసే పనిలో విద్యుత్‌శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
రెండు మూడు రోజుల్లో సీమాంధ్ర రాజధాని కమిటీ
‘‘ఆస్తులు, అప్పుల పంపిణీ తదితర అంశాలను బేరీజు వేసుకుని సాధ్యమైనంత త్వరలో అపాయింటెడ్ డే ప్రకటన ఉంటుంది. సిబ్బంది వ్యవహారాల శాఖ ఇప్పటికే విభజనకు సంబంధించి రెండు కమిటీలు ఏర్పాటుచేసింది. అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ట్రస్థాయి అధికారుల పంపిణీకి ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీలు సోమవారం నుంచి పనిచేస్తాయి. సీమాంధ్రకు కొత్త రాజధానిపై అధ్యయనం చేసేందుకు కమిటీ రెండు 3 రోజుల్లో ఏర్పాటవుతుంది..’’ అని జైరాం చెప్పారు.
సీమాంధ్రలో కలిసే ప్రాంతాలు ఇవీ..
పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లోని కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పాక్షికంగా) మండలాలు; భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం, రామాలయం సహా పట్టణం మినహా) మండలాలు
తెలంగాణలో ఉండే గ్రామాలు: బూర్గంపాడు మండలంలోని రెవెన్యూ గ్రామాలు పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెండి, మోతెపట్టినగర్, ఉప్పుశాక, నకిరీపేట, సోంపల్లి. అలాగే భద్రాచలం మండలంలోని భద్రాచలం రెవెన్యూ గ్రామం, రామాలయం సహా పట్టణం