* ప్రాణహిత ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సుముఖత
* మరోవారం రోజుల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీ
* కొత్త రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందని వెల్లడి
* కేంద్రమంత్రితో సీఎం భేటీ.. ప్రాజెక్టులపై చర్చ
* పోలవరం డిజైన్ మార్చాలని విన్నపం
* దేవాదులకు తొలి విడతగా రూ. 64 కోట్ల విడుదలకు కేంద్రమంత్రి అంగీకారం
* ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు పార్లమెంట్‌కు వెళ్లిన కేసీఆర్.. అక్కడ టీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని హామీలను సాధించేం దుకు ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చించినట్టు సమాచారం.
అనంతరం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కవిత, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, బాల్క సుమన్, బీబీ పాటిల్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రుడు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం వ్యక్తిగత కార్యదర్శి నర్సింగరావుతో కలిసి శ్రమశక్తి భవన్‌కు వెళ్లి కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాంతోపాటు ఆ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్.. ఉమాభారతిని కోరారు. ఈ సందర్భంగా ఇందులో సాంకేతిక సమస్యలపై రాష్ట్ర, కేంద్ర జలవనరుల శాఖల అధికారులతో ఉమాభారతి చర్చించారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రస్తావించగా, అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. విద్యుత్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.
‘ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రాతో ఏం లడాయి లేదుగా..’’ అని కేంద్రమంత్రి అడిగారు. ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం చెప్పారు. తర్వాత ఉమాభారతి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టు ఉండాలని నేను చాలా ఆత్రుతతో ఉన్నా. మా అధికారులతో వీలైనంత త్వరగా చర్చిస్తా. మేం చాలా సానుకూలంగా ఉన్నాం. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహాలు వద్దు’’ అని పేర్కొన్నారు. తెలంగాణలో దేవాదుల పూర్తి చేసేందుకు కూడా సహకరించాలని సీఎం కోరగా.. ఈ ప్రాజెక్టుకు వారం రోజుల్లో మొదటి విడత కింద రూ.64 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చండి..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణకు అభ్యంతరాలు లేవని, అయితే కేంద్రం నిర్ణయంతో మూడు లక్షల మంది గిరిజనులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్.. ఉమాభారతి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న చోటు దేశంలోనే రెండో భూకంప తీవ్రత కల్గిన ప్రాంతంగా నివేదికలు వచ్చాయని, డిజైన్ మార్చాలని కోరారు. ఇందుకు మంత్రి ఉమాభారతి స్పందిస్తూ.. ‘పోలవరం విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు కదా’ అని సూచించారు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. దీనిపై చర్చించుకునేందుకు తమకేం ఇబ్బంది లేదన్నారు.
అనంతరం చెరువులు, కుంటలను అనుసంధానం చేసే ‘మిషన్ కాకతీయ’ గురించి వివరించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా వేసే కార్యక్రమం గురించి సీఎం చెప్పగా.. కేంద్రం తరఫున సహకారం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు. సమావేశం అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కి బయలుదేరి వెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకున్నారు.
సానుకూలంగా స్పందించారు: కవిత
తెలంగాణకు కేంద్ర జలవనరుల శాఖ నుంచి సహకారం ఉంటుందని ఉమాభారతి హామీ ఇచ్చినట్టు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చెప్పారు.
తెలంగాణ నా బిడ్డ లాంటిది: ఉమాభారతి
‘‘తెలంగాణ నాకు బిడ్డ లాంటిది. ఉద్యమంలో నేను మా పార్టీ తరపున వచ్చాను. తెలంగాణ పదం వింటేనే నా నోరు తీపి అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తన కాళ్లమీద తాను నిలబడేందుకు నా శాఖ తరఫున పూర్తిగా సహకరిస్తా’’ అని సీఎం కేసీఆర్‌తో ఉమాభారతి అన్నారు. ఇందుకు సీఎం.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు హైదరాబాద్‌లో నా ఇంటికి వచ్చి ఆశీర్వదించారు. అప్పుడు నేను మీకు మొక్కిన ఫొటోనే పెద్దగా చేసి పెట్టుకున్నాను’’ అని గుర్తు చేశారు.
‘‘అప్పట్లో వార్తా పత్రికల్లోనూ ఆ ఫొటో పెద్దగా వచ్చింది. నాకు ఇంకా గుర్తుంది. అయినా అందులో తప్పేం లేదు. సోదరికి, సోదరి కూతుళ్లకు మొక్కడం మన సంప్రదాయం. కవిత నాకు కోడలు లాంటిది’’ అని మంత్రి ఆత్మీయంగా అన్నారు. ‘‘తెలంగాణ పేరిట ఉద్యమం చేసి చాలా మంది సీఎంలు అయ్యారు. ఆ తర్వాత వాళ్లంతా తెలంగాణకు శత్రువులుగా మారిపోయారు. మీరు మాత్రం ఎంతో తపస్సు చేసి తెలంగాణ సాధించుకున్నారు’’ అని కేసీఆర్‌ని అభినందించారు.
జాతీయ హోదాకు ఓకే!
Published Tue, Dec 9 2014 1:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement