ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయండి :రాందేవ్
యోగా గురు బాబా రాందేవ్, యూరి ఉగ్ర ఘాతుకంపై తీవ్ర స్థాయిలో స్పందించారు.
యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పులను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. యోగా గురు బాబా రాందేవ్ సైతం ఈ ఉగ్ర ఘాతుకంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత సైన్యం చొచ్చుకుని వెళ్లి, పాకిస్తాన్ తీవ్రవాద శిక్షణా శిబిరాలను నాశనం చేయాలని సైన్యానికి పిలుపునిచ్చారు. బుద్ధ, యుద్ధ రెండింటి సహకారంతో ప్రధాని మోదీ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ఆదివారం వేకువ జామున నలుగురు పాక్ ముష్కరులు యూరి సైనిక స్థావరంపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో 18 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనను భారత్తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పాకిస్తానే ఈ ఉగ్ర దాడికి పురిగొల్పిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చర్యకు పాల్పడిన వారిని వదిలేది లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) హెచ్చరించింది. ఇటువంటి దాడులకు భారత్ భయపడబోదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సైతం ఈ దాడిపై తీవ్రస్థాయిలో స్పందనలు వస్తున్నాయి. పాకిస్తాన్కు వ్యతిరేకంగా మిలటరీ చర్యలను పెంచాలని, దౌత్య మార్గాలను వదులుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.