
గాజా నగరంలోని ఓ యుఎన్ పాఠశాలలో సోమవారం ప్రార్థనలు చేసుకుంటున్న పాలస్తానీయులు
గాజా/జెరూసలేం: తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న గాజా ప్రాంతంలో సోమవారం ప్రశాంత పరిస్థితి ఏర్పడింది. ఇరవై రోజులపాటు తుపాకులు, రాకెట్ దాడులతో దద్దరిల్లిన ప్రాంతంలో ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు తగ్గడం, హమాస్ రాకెట్ దాడులు గణనీయంగా తగ్గడంతో గత 20 రోజులతో పోల్చితే గాజా ప్రశాంతంగా కనిపించింది. మరో వైపు, ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు అంతం పలుకుతూ వెంటనే కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చాయి.
మానవతా దక్పథంతో కూడిన బేషరతు కాల్పుల విరమణ ఒప్పందం ఉభయపక్షాల మధ్య తక్షణం కుదరాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం రాత్రి పిలుపునిచ్చింది. రంజూన్(ఈద్) పర్వదినం తర్వాత కూడా కాల్పుల విరమణ కొనసాగించాలని, ఘర్షణలో దెబ్బతిన్న గాజా ప్రాంత బాధితులకు అత్యవసర సహాయం అందేలా సహకరించాలని కోరింది.
శనివారం గాజాలోని వివిధ ప్రాంతాలలో శిధిల భవనాల నుంచి మరో 100 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని ఆస్పత్రులకు తరలించినట్లు పాలస్తీనా అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దీంతో గత 20 రోజుల్లో పాలస్తీనాలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది.