
ప్యాంటు జేబులోని సెల్ ఫోన్ కాలిపోవడంతో..
వాషింగ్టన్: అమెరికాలోని పుయల్లుప్ సిటీలో ఓ వ్యక్తికి విభ్రాంతికర సంఘటన ఎదురైంది. షాపింగ్ చేస్తున్న సమయంలో అతని ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ కాలిపోయింది. ప్యాంటు జేబులోంచి మంటలు రావడంతో అతను తనను కాపాడుకోవడానికి వెంటనే ప్యాంటు విప్పేశాడు. జాకెట్ విప్పి నడుం చుట్టు కట్టుకున్నాడు. ఓ ఉద్యోగి అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పివేశాడు. ఈ ఘటన జరిగినపుడు షాపులో ఉన్న ఎవరెట్ ట్రెల్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ వివరాలు చెప్పాడు. ఇలాంటి ఘటనను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, భారీగా పొగలు వ్యాపించాయని, అక్కడున్నవారు భయపడ్డారని చెప్పాడు.
షాపు మేనేజర్ బాధితుడికి జత కొత్త ప్యాంట్లు అందజేశాడు. బాధితుడికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడు. అతని సెల్ ఫోన్ కాలి బూడిదైందని, ప్యాంటు పడిన చోట నల్లగా మరక ఏర్పడిందని చెప్పాడు. బాధితుడి పేరు, ఫోన్ ఎందుకు కాలిందన్న వివరాలు తెలియరాలేదు.