
లాటరీతో హెచ్1బి వీసాల జారీ
* అమెరికా వీసా కోసం 1,72,000 దరఖాస్తులు
* లాటరీ ద్వారా 85,000 దరఖాస్తుల ఎంపిక
* మరిన్ని వీసాలకు అమెరికా ఐటీ సంస్థల వినతి
వాషింగ్టన్: అమెరికాలో పని చేసేందుకు విదేశీయులకు అనుమతినిచ్చే హెచ్1బి వీసాల కోసం ఈసారి 1,72,000 దరఖాస్తులు అందాయి. అయితే.. ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కేవలం 85,000 వీసాల (రెండు తరగతులూ కలిపి) జారీకి మాత్రమే అనుమతి ఉండటంతో.. అమెరికా పౌరసత్వం, ప్రవాస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి దరఖాస్తుదారులకు లాట్లు కేటాయించింది. భారత్ వంటి దేశాలకు చెందిన సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులు అమెరికా హెచ్1బి వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తులు చేసుకుంటారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఐదు రోజుల్లోనే 1,72,000 దరఖాస్తులు అందాయి. ఇందులో సాధారణ తరగతి దరఖాస్తులతో పాటు, ప్రత్యేక తరగతి దరఖాస్తులు కూడా ఉన్నాయి. సాధారణ తరగతిలో 65,000 వీసాలు, ప్రత్యేక తరగతిలో 20,000 వీసాలు జారీ చేస్తారు. ఈ నేపధ్యంలో తొలుత ప్రత్యేక తరగతి దరఖాస్తులకు లాటరీ నిర్వహించి 20,000 మందికి లాట్లు ఖరారు చేశారు.
ఈ తరగతిలో ఎంపిక కాని వారి దరఖాస్తులను కూడా సాధారణ తరగతి దరఖాస్తులతో చేర్చి మొత్తం 65,000 దరఖాస్తులను లాటరీలో ఎంపికచేశారు. మిగతా దరఖాస్తులను సంబంధిత రుసుములతో సహా దరఖాస్తుదారులకు వాపసు చేస్తామని పౌరసత్వం, ప్రవాస సేవల విభాగం తెలియజేసింది. అయితే.. పోటీ ప్రపంచంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగేందుకు మరిన్ని హెచ్1బి వీసాలు జారీ చేయాలని అమెరికా ఐటీ సంస్థల సంఘం కోరుతోంది.