దేవయాని కేసులో వెనక్కి తగ్గేది లేదు: అమెరికా
భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదేపై కేసును ఉపసంహరించే ప్రసక్తే లేదని అమెరికా ఖరాకండిగా చెప్పింది. ఆ విషయంలో క్షమాపణలు కూడా చెప్పబోమని స్పష్టం చేసింది. తమ దేశ దౌత్యవేత్త పట్ల ఆమెరికా వ్యవహరించిన తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే దేవయానిపై నమోదైన కేసును యుద్ధ ప్రాతిపదికన ఉపసంహరించాలని భారత్ చేసిన డిమాండ్ను అమెరికా తోసిపుచ్చింది.
ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ శుక్రవారం వాషింగ్టన్లో వెల్లడించారు. దేవయానిపై నమోదైనది అషామాషి కేసు కాదని మేరీ అభిప్రాయపడ్డారు. అయితే ఆమెను ప్రాసిక్యూట్ చేస్తారో, లేదో తనకు తెలియదని చెప్పారు. ఈ అంశంపై అమెరికా కోర్టులు ఏమైనా స్పందిస్తే అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు.
ఖోబ్రగడే 1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారిణి. న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఇంట్లో సహాయకారిగా ఉండేందుకు భారత్‌లో నుంచి సంగీత రిచర్డ్‌ను నెలకు రూ. 30 వేల జీతంతో పనిమనిషిగా పెట్టుకున్నారు. దేవయాని మూల వేతనమే రూ.26 వేలు కావడం ఇక్కడ గమనార్హం. 2012 నవంబర్ 23న సంగీత న్యూయార్క్ వెళ్లారు. అయితే అక్కడ ఖాళీ సమయంలో తాను వేరే ఉద్యోగం చేసేందుకు అనుమతించాలని దేవయానికి కోరింది. అందుకు యూఎస్ చట్టాలు అనుమతించవని సంగీతకు దేవయాని వివరించింది.
ఆ క్రమంలో దేవయాని ఇంటి నుంచి సంగీత పరారైంది. ఆ క్రమంలో దేవయాని మరియు సంగీత దంపతుల మధ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో దేవయానిపై యూఎస్ లో కేసు నమోదు అయింది. అంతేకాకుండా దేవయానిని తనిఖీ చేసే క్రమంలో ఉన్నత అధికారి అనే విషయాన్ని మరిచి యూఎస్ అధికారులు ప్రవర్తించారు. దీంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవయానిపై కేసు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని యూఎస్ ను భారత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.