దేవయానిపై కుట్ర: కేంద్రం
దౌత్యాధికారి ఉదంతంపై పార్లమెంటులో ప్రకటన
అమెరికా చర్య వంచనే;
పనిమనిషి కుటుంబానికి వీసాపై మండిపాటు
దేవయానిని సగౌరవంగా
వెనక్కు తీసుకొస్తాం: ఖుర్షీద్
న్యూఢిల్లీ/వాషింగ్టన్/న్యూయార్క్: మహిళా దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదె (39)పై అమెరికాలో పెద్ద కుట్ర జరిగిందని భారత్ ఆరోపించింది. సరైన వేతనాలివ్వడం లేదంటూ పనిమనిషి చేసిన ఆరోపణల ఆధారంగా ఆమెను గత గురువారం న్యూయార్క్‌లో నడిరోడ్డుపై సంకెళ్లు వేసి మరీ అరెస్టు చేయడం, తనకు దౌత్యపరమైన రక్షణ ఉందని పదేపదే చెబుతున్నా వినకుండా అమానుషంగా బట్టలు విప్పి, ఒళ్లంతా తడిమి సోదా చేయడం, సెక్స్ వర్కర్లు, డ్రగ్ స్మగ్లర్లతో పాటు ఖైదులో ఉంచడం తెలిసిందే. ఆ తరువాత 2.5 లక్షల డాలర్ల పూచికత్తుపై ఆమెను విడుదల చేశారు. అరెస్టు మాటున ఆమెకు జరిగిన ఈ ఘోర అవమానం యాదృచ్ఛికమేమీ కాదని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. ‘అక్రమానికి సహకరించాల్సిందిగా కొందరు ఆమెను బలవంతపెట్టారు. అందుకు నిరాకరించడంతో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులో ఇరికించారు’ అని పేర్కొంది. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. దేవయాని పూర్తిగా నిర్దోషి అని స్పష్టం చేశారు. అమెరికా చర్య పూర్తిగా అవాంఛనీయమంటూ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను ఆయన వివరించారు. ఇది దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమని, దేవయానిని సగౌరవంగా భారత్ తీసుకొస్తామని ఖుర్షీద్ ప్రకటించారు. లేదంటే తాను తిరిగి పార్లమెంటులో అడుగు పెట్టబోనని ప్రకటించారు. ఈ ఉదంతంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ తొలిసారి స్పందించారు.
మహిళా దౌత్యవేత్తకు ఇలా బేడీలు వేయడం, శోధన పేరుతో ఘోరంగా అవమానించడం గర్హనీయమంటూ తప్పుబట్టారు. ‘స్పష్టమైన, ధృడమైన మా సందేశాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక అమెరికా దాష్టీకానికి ప్రతిచర్యగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి భద్రత తగ్గింపు సహా తాము చేపట్టిన చర్యలన్నీ సబబేనని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు పనిమనిషి సంగీతా రిచర్డ్స్ కుటుంబానికి దేవయానికి అరెస్టుకు సరిగ్గా రెండు రోజుల ముందు డిసెంబర్ 10న అమెరికా వీసా జారీ చేసి మరీ న్యూయార్క్‌కు రప్పించుకోవడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపించింది. తద్వారా అమెరికా మోసానికి, తీవ్ర వంచనకు పాల్పడిందంటూ ఆరోపణలు చేసింది. దేవయానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేలా ఒప్పించి అమెరికా వారిని న్యూయార్క్‌కు రప్పించుకుందంటూ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. దేవయానికి పూర్తిస్థాయి దౌత్యపరమైన రక్షణ కల్పించేందుకు వీలుగా ఆమెను బుధవారమే న్యూయార్క్‌లోని భారత ఐరాస శాశ్వత మిషన్ కార్యాలయానికి బదిలీ చేశారు.
విచారం వ్యక్తం చేసిన అమెరికా..
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయానిని దుస్తులు తొలగించి మరీ తనిఖీ చేయడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ భారత జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్‌తో బుధవారం అర్ధరాత్రి ఫోన్‌లో మాట్లాడారు. జరిగినదానికి విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ ఘటన ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు దేవయాని అంశంలో విచారం వ్యక్తం చేస్తూ.. అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ కూడా ప్రకటన విడుదల చేసింది.
ఏడ్చి, మొత్తుకున్నా వినలేదు!
ప్రధాన కార్యాలయానికి పంపిన ఈమెయిల్‌లో దేవయాని
న్యూఢిల్లీ: నడివీధిలో బేడీలు వేసి తీసుకువెళ్లడం, విచారణ పేరుతో దారుణమైన చర్యలకు పాల్పడటాన్ని మహిళా దౌత్యవేత్త దేవయాని మర్చిపోలేకపోతోంది. అక్కడి అధికారులు అత్యంత హేయంగా వ్యవహరిస్తున్న సందర్భంలో చాలాసార్లు కన్నీళ్ల పర్యంతమయ్యాయని ఇక్కడి తమ ప్రధాన కార్యాలయానికి పంపిన ఈ మెయిల్‌లో ఆమె తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ మెయిల్‌లో ‘నాకు దౌత్యపరమైన రక్షణ ఉంటుందని వారికి చాలాసార్లు చెప్పాను. గట్టిగా వాదించాను. అయినా, మళ్లీమళ్లీ తనిఖీల పేరుతో వేధించారు.
బేడీలు వేయడం, దుస్తులు విప్పించి, ఆసాంతం తడుముతూ తనిఖీ చేయడం దుర్భర వేదనకు గురిచేసింది. ఆ సమయంలో చాలాసార్లు ఏడ్చాను. సాధారణ నేరస్తులు, స్మగ్లర్లు, డ్రగ్స్ వ్యసనపరులతో కలిపి ఖైదు చేయడం భరించలేకపోయాను. నా దౌత్య రక్షణ గురించి ఎంత మొత్తుకున్నా వారు పట్టించుకోలేదు. ఆ తరువాత ధైర్యం కూడదీసుకున్నాను. నా సహచరులను, నా దేశాన్ని గుర్తుచేసుకున్నాను. వారి ప్రతనిధిగా నిర్భయంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. నాకు, నా పిల్లలకు భద్రత కల్పించడంతో పాటు, దేశ దౌత్యవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.ట