కిమ్ జాంగ్ ఉన్ ఆస్తులపై కొరడా!
సాక్షి, ఐరాస: ప్రపంచ దేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా.. వరుస అణు పరీక్షలతో గుబులు రేపుతున్న ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలకు రంగం సిద్ధమైంది. ఉత్తరకొరియాకు చమురు ఎగుమతిని నిషేధించాలని, ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు ఉన్న ఆస్తులన్నింటినీ స్తంభింపజేయాలని తాజాగా అమెరికా ప్రతిపాదించింది.
ఈ మేరకు ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలకు సంబంధించిన ముసాయిదాను భద్రతా మండలి సభ్యులకు అమెరికా పంచింది. వరుసగా ఆరోసారి అణుపరీక్షలు నిర్వహించడమే కాకుండా.. హైడ్రోజన్ బాంబును సైతం పరీక్షించామని, అమెరికాపై దాడి చేస్తామని ఉత్తర కొరియా రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆంక్షలను ప్రతిపాదిస్తూ అమెరికా ముసాయిదా రూపొందించింది. అయితే, అణు పరీక్షలు మానుకోవాలని హెచ్చరిస్తూ ఐరాస ఇప్పటికే అత్యంత కఠినమైన ఆంక్షలను ఉత్తర కొరియాపై విధించింది. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలను భద్రతా మండలి సభ్యులైన రష్యా, చైనా వ్యతిరేకించే అవకాశముంది.
ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి బొగ్గు గనుల ఎగుమతులను ఐరాస నిషేధించింది. దేశ ఎగుమతుల్లో మూడోవంతు వాటాఈ బొగ్గు ఎగుమతులదే. వీటిని నిషేధించడంతో కొరియాకు బిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. ఇక, కొరియాకు ఇంధన ఉత్పత్తుల సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని, ఆ దేశ వస్త్ర పరిశ్రమ ఎగుమతులను నిషేధించాలని అమెరికా తాజాగా ప్రతిపాదించింది. అంతేకాకుండా కిమ్ జాంగ్ ఉన్, కొరియా ప్రభుత్వ ఆస్తులను స్తంభింపజేయాలని, ఆ దేశ అధికారుల విదేశీ పర్యటనలను నిషేధించాలని సూచించింది. కొరియా కార్మికులు విదేశాల్లో పనిచేయకుండా నిషేధించాలని పేర్కొంది. దుస్తుల ఎగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న తమ కార్మికుల ఆదాయం వల్లే విదేశీ ద్రవ్యాన్ని కొరియా ఆర్జించగలుగుతోంది. వీటిని నిలిపేస్తే.. కొరియా మనుగడ కష్టమై.. దారిలోకి వస్తుందని అమెరికా భావిస్తోంది. అయితే, ఈ ఆంక్షల అమలుకు భద్రతా మండలిలో వీటో అధికారమున్న చైనా, రష్యా ఎంతవరకు సహకరిస్తాయనేది ప్రశ్నార్థకమే.