ముజఫర్నగర్లో మత ఘర్షణల కారణంగా కుటుంబసభ్యులను కోల్పోయిన యువతపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోసి పుచ్చింది. ముజఫర్ నగర్ ముస్లిం యువతను ఐఎస్ఐ సంప్రదించినట్లు కేంద్ర హోం శాఖ గానీ... నిఘా వర్గాలు కానీ తమకు ఎటువంటి సమాచారం అందించలేదని ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి కమల్ సక్సెనా శనివారం లక్నోలో వెల్లడించారు. ఇదే విషయాన్ని తీవ్రవాద వ్యతిరేక బృందం ముఖ్య అధికారి ముకుల్ గోయిల్ కూడా ధృవీకరించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ముజఫర్ నగర్లో ఇటీవల చోటు చేసుకున్న మత ఘర్షణలు చాలా మంది మరణించారు. మృతుల కుటుంబాలకు చెందిన 15 నుంచి 20 మంది యువకులను పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సంప్రదించిందని ఆయన వెల్లడించారు. ఆ విషయాన్ని భారత్ నిఘా అధికారి తమకు వెల్లడించారని రాహుల్ గాంధీ బహిరంగ సభలో పేర్కొన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
భారత్లోని ఓ వర్గాన్ని రాహుల్ గాంధీ తన వాఖ్యల ద్వారా అవమానపరిచారంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఆరోపించారు. తక్షణమే ముస్లిం వర్గానికి రాహుల్ క్షమాపణలు చెప్పాలని మోడీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిఘా అధికారి పేరు వెల్లడించాలని ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పౌర సమాజ కార్యకర్త నూతన్ ఠాకూర్ రాహుల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.