సమయం అయిపోయినా దర్జాగా నోట్ల మార్పిడి!
బ్యాంకు టైం అయిపోయినా దర్జాగా నోట్ల మార్పిడి!
Published Sat, Nov 19 2016 11:03 AM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM
రాంపూర్ : బ్యాంకు నోట్ల మార్పిడికి సాధారణ ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చుని ఇబ్బందులు పడుతుంటే... ఉత్తరప్రదేశ్లో ఓ మంత్రి మాత్రం దర్జాగా బ్యాంకు సమయం అయిపోయిన తర్వాత వెళ్లి మరీ నోట్లు మార్చుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే బ్యాంకు మేనేజర్, ఆ మంత్రి కలిసి కూర్చుని కబుర్లు చెపుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్లోని ఆహార, ఔషధ పరిపాలన విభాగానికి చెందిన రాష్ట్ర మంత్రి ఇక్బాల్ మెహమూద్ను తన ఇద్దరు కొడుకులను సంబాల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ సమయం అయిపోయిన తర్వాత(ఏడు గంటల తర్వాత) బ్యాంకులోకి అనుమతించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా నాలుగున్నరకే మూతపడే బ్యాంకులు, పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న పరిణామాలతో ప్రజల కోసం మరికొద్ది గంటలు తెరచి ఉంచుతున్నాయి. ఆరుగంటలకు బ్యాంకు మూత పడిన తర్వాత, ఆ బ్యాంకు మేనేజర్, మంత్రి కొడుకులకు నోట్ల మార్పిడికి అవకాశమిచ్చారని తెలుస్తోంది.
అదేవిధంగా మంత్రి, మేనేజర్ ఇద్దరు కలిసి క్యాబిన్లో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్టు ఆ వీడియో చూపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆయన ఖండించటం గమనార్హం. బ్యాంకులోకి వెళ్లేముందు అందరిలాగే, తాను క్యూలో నిల్చున్నానని ఆయన తెలిపారు. ‘నిజమే తాను బ్యాంకు మేనేజర్ వద్ద కూర్చుని మాట్లాడాను.. అలాగే మా అబ్బాయిలు కూడా ధ్రువీకరణ పత్రాలు చూపించే కరెన్సీ నోట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాతే మేనేజర్ని కలిశాం’ అంటూ ఇక్బాల్ చెప్పారు.
మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన బ్రాంచ్ మేనేజర్ జవేద్ ఖాన్ ‘బుధవారం కరెన్సీ త్వరగా అయిపోయింది. కొన్ని గంటలు నోట్ల ఎక్స్చేంజ్ను నిలిపివేశాం. నాలుగున్నర తర్వాత బ్యాంకుకు క్యాష్ రావడంతో అప్పుడు నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభించాం. దీంతో సాధారణ రోజుల కంటే కొంత ఆలస్యంగా బ్యాంకును మూసివేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. అలాగే మంత్రికి కూడా బ్యాంకు సమయం అయిపోయిన తర్వాత నోట్లను మార్పిడి చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రొటోకాల్ను ఉల్లంఘించినట్టు తనకు అనిపించడం లేదని సమర్థించుకున్నారు.
Advertisement