
ఉరిశిక్షపై వరుణ్ గాంధీ ఏమన్నారో తెలుసా?
మరణశిక్షను రద్దు చేయాలా.. వద్దా? ఈ అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ఇప్పుడు ఉరిశిక్షను రద్దుచేయాలని పోరాడేవాళ్ల జాబితాలోకి చేరిపోయారు. మరణశిక్ష వల్ల కేవలం పగ చట్టబద్ధం అయిపోతుందని వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష వల్ల సమాజంలో అరాచకత్వం పెరిగిపోతుందన్నది యుగాలుగా రుజువు అవుతూనే ఉందన్నారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరితీత నేపథ్యంలో వరుణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మరణశిక్షను నిషేధించాలని వరుణ్ గాంధీ చెప్పారు. అరుదైన వాటిల్లోకెల్లా అరుదైన కేసు అంటే ఏమిటన్న దానికి భారత న్యాయ వ్యవస్థలో స్పష్టమైన నిర్వచనం లేదని, న్యాయమూర్తి నిర్ణయాన్ని బట్టి, సామాజిక - రాజకీయ నమ్మకాలను బట్టి ఇది నిర్ణయం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో.. మరణశిక్ష మాత్రమే ఒక మాయని మచ్చగా ఉందన్నారు. వాస్తవానికి ఇప్పుడు బతుకుతున్న చాలామందికి చావుకు అర్హత ఉందని, చనిపోయిన కొంతమందికి బతికే అర్హత ఉందని వరుణ్ చెప్పారు.