వెరిజోన్ చేతికి యాహూ?
లండన్ : యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కోనుగోలుకు ప్రముఖ వైర్ లెస్ దిగ్గజం వెరిజోన్ సంస్థ అంతాసిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొదటినుంచీ గట్టి పోటీదారుడుగా భావిస్తున్న వెరిజోన్ చివరకి యాహూ ను కైవసం చేసుకోనుంది. ఈ క్రమంలో ఈ రెండు సంస్థల మధ్య చర్చలు మరింత సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. సుమారు రూ. 33 వేల 575 కోట్లకు (5 బిలియన్ డాలర్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్దమైనట్టు ఇరు కంపెనీల సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించనున్నట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు వచ్చే వారం రోజుల్లోపే ఈ డీల్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా.
అయితే వెరిజోన్ యాహూ కోర్ ఇంటర్నెట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమనీ, ఈ ఒప్పందంలో యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులు, పేటెంట్లు లాంటి ఇతర ఆస్తులు ఉండవని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. నాన్ కోర్ మేధో సంపత్తి ఆస్తుల అమ్మకం విడిగా విక్రయించబడుతుందని తెలిపారు. మరోవైపు వెరీజోన్ తప్ప మరి ఏ కంపెనీ యాహూ ఆస్తులను కొనుగోలు చేయలేదని రీకాన్ ఎనలిస్ట్ రోజర్ ఎ ట్నెర్ వ్యాఖ్యానించారు.అయితే వెరిజోన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీనిపై స్పందించడానికి నిరాకరించినట్టు సమాచారం. 140 మిలియన్లకు పైగా యూజర్లతో ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం ఎడ్వర్టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది. డిజిటల్ ప్రకటనల మార్కెట్లో పోటీ పెరగనుందనీ, 200 మిలియన్ యాహూయూజర్లతో వెరిజోన్ ప్రకటనల బేస్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ సంవత్సరం యాహూ షేర్లు ఇప్పటివరకు 18 శాతానికిపైగా వృద్ధి చెందాయి
కాగా మిగతా బిడ్డర్స్ లో పెట్టుబడిదారులు సమాఖ్య (కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టర్స్), బైన్ క్యాపిటల్ ,బెర్క్ షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫ్ఫెట్, ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎల్లో పేజెస్ మాతృ సంస్థ వైపి హోల్డింగ్స్ పేర్లు ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే.