సోనియాతో విజయశాంతి భేటీ
ఎంపీ రేణుకతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి నివాసానికి
ఉత్తరాంధ్ర జిల్లాలను తెలంగాణలో కలపాలి: రేణుక
సాక్షి, న్యూఢిల్లీ: మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. అధికారికంగా కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది కచ్చితంగా తెలియకున్నా.. ఈ పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆమె అధిష్టానం పెద్దల చేతుల మీదుగా ఇక్కడి కాంగ్రెస్ కార్యాలయంలోనే పార్టీ సభ్యత్వం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావే శాలకు హాజరయ్యేందుకు బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన విజయశాంతి గురువారం సాయంత్రం రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. పార్టీలో చేరే విషయమై ఆమెతో పది నిమిషాల పాటు మంతనాలు జరిపారు. విజయశాంతిని సోనియాకు పరిచయం చేసిన రేణుక.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
సినీ పరిశ్రమలో రాణించి రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నారని, విజయశాంతి చేరికతో పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని రేణుక వివరించినట్లుగా తెలిసింది. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు విజయశాంతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సానుకూల నిర్ణయంతో కాంగ్రెస్‌కు తెలంగాణలో మైలేజీ పెరిగిందని, టీఆర్‌ఎస్ నేత లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని విజయశాంతి తెలిపినట్లుగా సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడలేదు. కాగా, ఈ భేటీపై రేణుకాచౌదరి స్పందిస్తూ ‘తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఎప్పుడు చేరేది ఆమెనే అడగండి’ అని అన్నారు. తాను తెలంగాణ ఆడబిడ్డనేనని, దీనిలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని రేణుక చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తీరప్రాంతం ఉండాలని, ఈ దృష్ట్యా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఆమె డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని తెలంగాణ నుంచి విడదీస్తే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలొస్తాయని ముఖ్యమంత్రి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె అన్నారు.