జనంలో సానుభూతి కోసమే విక్రమ్‌ అలా.. | vikram goud is the kingpin in film nagar firing case, says cp | Sakshi
Sakshi News home page

జనంలో సానుభూతి కోసమే విక్రమ్‌ అలా..

Published Wed, Aug 2 2017 4:30 PM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

జనంలో సానుభూతి కోసమే విక్రమ్‌ అలా.. - Sakshi

జనంలో సానుభూతి కోసమే విక్రమ్‌ అలా..

- థ్రిల్లర్‌ను తలదన్నేలా విక్రమ్‌ గౌడ్‌ క్రైమ్‌ ప్లాన్‌
- సానుభూతితోపాటు విరోధులకు భయం పుట్టించాలనే!
- రూ.50 లక్షలు సుపారీ ఇచ్చి తనపైనే హత్యాయత్నం డ్రామా
- అడ్డొస్తే భార్యపైనా కాల్పులు జరపాలని షూటర్లకు ఆదేశం
- ఫిలింనగర్‌ కాల్పుల కేసు వివరాలను మీడియాకు తెలిపిన సీపీ
- మోటివేషన్‌ చేసిమరి కాల్పించుకున్న కాంగ్రెస్‌ నేత
- సూత్రధాని, పాత్రధారి, ఏ1 ముద్దాయి.. అన్నీ విక్రమ్‌ గౌడే


హైదరాబాద్‌:
సూపర్‌హిట్‌ తెలుగు సినిమా ‘అతడు’ గుర్తుందికదా! అందులో ముఖ్యమంత్రి కావాలనుకున్న ఓ రాజకీయ నాయకుడు తనపై హత్యాయత్నం జరపాలని నేరస్తులను సంప్రదిస్తాడు. కానీ అనూహ్యంగా అతనే చనిపోతాడు!! ఇటీవల హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం కూడా ‘అతడు’ను తలపించేదే. అయితే సినిమాకు విరుద్ధంగా తనను తాను చంపించుకువాలనుకున్న వ్యక్తి.. చివరికి చట్టానికి చిక్కడం రియల్‌ లైఫ్‌ ట్విస్ట్‌!!

అవును. కాంగ్రెస్‌ యువనాయకుడు విక్రమ్‌ గౌడ్‌పై జరిగిన హత్యాయత్నంలో కర్త, కర్మ, క్రియ, బాధితుడు, నిందితుడు.. అన్నీ తానేనని ఒప్పుకున్నాడు. సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు..

షూటర్లు, ఆయుధాల కోసం పడరానిపాట్లు..
మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ తనయుడు, కాంగ్రెస్‌ యువనాయకుడైన విక్రమ్‌ గౌడ్‌.. గత జీహెచ్‌ఎంపీ ఎన్నికల్లో జాంబాగ్‌ డివిజన్‌ నుంచి పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్న ఆయన.. నియోజకవర్గంలోని ప్రజలకు తనపై సానుభూతి కలగలాలని భావించాడు. అదే సమయంలో విరోధులు తన జోలికి రాకుండా గట్టి షాక్‌ ఇవ్వాలనుకున్నాడు. రకరకాలుగా ఆలోచించి, చివరికి ‘అతడు’  ప్లాన్‌ను ఓకే చేసుకున్నాడు. అటుపై షూటర్లకోసం వెతుకులాడాడు. ఆ క్రమంలోనే విక్రమ్‌.. తనకు పరిచయస్తుడైన అనంతపురం జిల్లా కదిరి వాసి గోవిందరెడ్డిని సంప్రదించాడు. ఇంతకుముందు ఇలాంటివి చేసిఉండకపోవడంతో గోవింద్‌.. నందకుమార్‌ అనే వ్యక్తి(ఇతనికి 7 కేసుల్లో ప్రమేయం ఉంది)ని సంప్రదించాడు. రూ.50 లక్షలకు బేరం కుదిరింది. తుపాకుల కోసం కదిరికే చెందిన షేక్‌ అహ్మద్‌, బాబూజాన్‌లను సంప్రదించగా, వారు.. ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)కు చెందిన రియాజ్‌ పేరును సూచించారు. వెంకటరమణ​ అనే మరో వ్యక్తిని వెంటపెట్టకుని గోవింద్‌, నందూ, అహ్మద్‌లు విమానంలో ముంబై మీదుగా ఇండోర్‌ వెళ్లి, రియాన్‌ను కలిసి‌ 30 వేలు చెల్లించి, తుపాకిని కొన్నారు. మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు విక్రమ్‌గౌడ్‌ మానిటర్‌ చేస్తూనేవచ్చాడు.

ఇండోర్‌ నుంచి తెప్పించిన తుపాకిని విక్రమ్‌ తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. నిత్యం గ్యాంగ్‌తో హత్యాయత్నం ఎలా చెయ్యాలనేది చర్చించేవాడు. ఈ క్రమంలోనే 26 తేది రాత్రి ఫిలింనగర్‌లోని విక్రమ్‌గౌడ్‌ ఇంటికి గ్యాంగ్‌ మొత్తం వచ్చింది. ఆ రోజే కాల్పులు జరగాల్సిఉంది. కానీ గ్యాంగ్‌లోని గోంవింద్‌, నందులు కాస్త తటపటాయించడంతో టాస్క్‌ వాయిదా పడింది. ఒక దశలో మేం చెయ్యలేమని వాళ్లు చేతులెత్తేశారు. దీతో విక్రమ్‌ ఖంగుతిన్నాడు. ఆ తర్వాత గౌస్‌ అహ్మద్‌ సలహా మేరకు ఇండోర్‌ నుంచి రియాజ్‌ ను రప్పించి, ప్లాన్‌ అమలు చేయాలనుకున్నారు. స్వస్థలం పులివెందుల(కడప జిల్లా)కు వెళ్లిపోయిన నందకుమార్‌.. రియాజ్‌ వస్తున్న విషయం తెలుసుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాడు.

అడ్డొస్తే భార్యను కాల్చేయండి..!
27 రాత్రి, 28 తెల్లవారుజామున టాస్క్‌ అమలు చేశారు. ఈ క్రమంలో ఎవరైనా అడ్డొస్తే ఏం చెయ్యాలో విక్రమ్‌గౌడ్‌ తన గ్యాంగ్‌ సభ్యులకు ముందే చెప్పాడు. తన భార్య అడ్డొస్తే ఆమెపై ఒక రౌండ్‌ పేల్చాలని, వాచ్‌మెన్‌ వచ్చినా అదేపని చేయాలని విక్రమ్‌ సూచించాడు. రియాజ్‌ ఇంట్లోకి వెళ్లగా, అహ్మద్‌ బైక్‌ స్టార్ట్‌ చేసి రెడీగా ఉన్నాడు. వాళ్లిద్దరినీ అక్కడి నుంచి తప్పించేందుకు నందూ కారుతో జూబ్లీహిల్స్‌ రోడ్డు వద్ద వెయిట్‌ చేశాడు. స్వయంగా విక్రమ్‌గౌడ్‌ తీసుకొచ్చి ఇచ్చిన తుపాకితో రియాజ్‌.. మొదట ఎడమ భుజంపై కాల్చాడు. దెబ్బకు విక్రమ్‌ సోఫాలో కూలబడ్డాడు. విక్రమ్‌ చెయ్యి సరిగా ఎత్తలేక పోవడంతో భుజంలోకి వెళ్లాల్సిన రెండో బుల్లెట్‌.. కడుపులోకి దూసుకెళ్లింది. రియాజ్‌ మూడో తూటా పేల్చడానికి ప్రయత్నించగా.. తుపాకి చెడిపోయింది. ఇక చేసేదేమీలేక ప్లాన్‌ ప్రకారం అక్కడి నుంచి పారిపోయాడు.

ముందే కక్కేసిన విక్రమ్‌..!
కాల్పుల అనంతరం గాయపడ్డ విక్రమ్‌ గౌడ్‌ను అతని భార్య షిఫాలి ఆస్పత్రిలో చేర్పించింది. అయితే, కాల్పులు ఎలా జరిగాయనేదానిపై విక్రమ్‌ ఆమెకు ముందే ఓ కట్టుకథ చెప్పడంతో, ఆమె కూడా అదే విషయాలను పోలీసులకు చెప్పారు. ఆమె చెప్పిన విషయాల్లో కొన్ని విరుద్ధంగా తోచడంతో అధికారులు తమదైన శైలిలో విక్రమ్‌ను  ప్రశ్నించారు. విచారణలో బ్రేకైపోయిన విక్రమ్‌.. ప్లాన్‌ మొత్తాన్ని పోలీసుల ముందు కక్కేశాడు. దీంతో విక్రమ్‌గౌడ్‌ను ఏ1గా, కాల్పులు జరిపిన రియాజ్‌ను ఏ2గా పేర్కొంటూ మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో ఆరుగురు అరెస్ట్‌కాగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు హైదరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి చెప్పారు.

విక్రమ్‌ భార్యకు ఏమీ తెలియదు..
కాగా, విక్రమ్‌ క్రైమ్‌ ప్లాన్‌ గురించి ఆయన భార్య షిఫాలికి ఏమీ తెలియదని సీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. కొద్ది రోజులుగా తన భర్త ఆందోళనలో ఉన్న విషయం గుర్తించానని షిఫాలి పోలీసు విచారణలో తెలిపనట్లు సీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను.. డిశ్చార్జి కాగానే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement