
వేస్ట్‌తో బెస్ట్ రోడ్లు
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అనే సామెతకు సూపర్ ఉదాహరణ ఈ వినూత్న టెక్నాలజీ. ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతోందని... ఫలితంగా అనేక పర్యావరణ నష్టాలు జరుగుతున్నాయని ఒకవైపున మనం ఎంతో బాధపడుతున్నామా?... రోడ్డు ఎక్కితే చాలు.. గతుకులు కనిపిస్తూ వాహనం నడుపుతూ వెన్ను విరగ్గొట్టుకుంటున్నామా? నెదర్లాండ్స్‌లోని ఓ కంపెనీ ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారాన్ని ఆవిష్కరించింది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఈ కంపెనీ ప్లాస్టిక్ రోడ్లను అభివృద్ధి చేసింది. ఆ... ఇందులో ఏముంది గొప్ప... ఆ మధ్య బెంగళూరులో... ఆ తరువాత హైదరాబాద్‌లోనూ ఇలాంటివి వేస్తున్నామన్న వార్తలు వచ్చాయి కదా... అనకండి. వోల్కర్ వెస్సెల్స్ కంపెనీ ప్లాస్టిక్ రోడ్లు చాలా డిఫరెంట్!
ముందుగా చెప్పుకోవాల్సింది... ఈ రోడ్లను అక్కడికక్కడ వేసేయరు. ఫ్యాక్టరీలో తయారు చేసిన ముక్కలను కావాల్సిన చోట్ల అతితక్కువ సమయంలో పేర్చి, అతుకు పెడతారు అంతే. గతుకులు పడితే రోడ్డు మొత్తం తవ్వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ భాగాన్ని మాత్రమే తీసివేసి కొత్తది వేయవచ్చు. ఇక రెండో ప్రత్యేకత... ఈ రోడ్ల లోపలి భాగం డొల్లగా ఉంటుంది. ఫలితంగా చిన్న చిన్న వానలు వచ్చినా నీళ్లు రోడ్లపై కాకుండా ఈ డొల్ల భాగంలో నిలిచి... ఆ తరువాత నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోతాయన్నమాట. లోపల డొల్లగా ఉంటే వాహనాల బరువును తట్టుకోగలదా? అని అనుకోవద్దు. సాధారణ రోడ్ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ దృఢంగా ఉంటుందని పరీక్షలు నిరూపిస్తున్నాయి.
నెదర్లాండ్స్‌లో ఉన్న పరిస్థితులకు సరిపోతుందేమో అనేది కూడా అపోహే అంటోంది వోల్కర్ వెస్సెల్స్. ఈ రోడ్లు 80 డిగ్రీ సెల్సియస్ వేడిని కూడా తట్టుకోగలవు. వీటితోపాటు... రోడ్డు లోపలి డొల్ల ప్రాంతాన్ని వాడుకుంటూ కేబుల్స్, నీటిపైపులు సులువగా బిగించుకోవచ్చు, అవసరమైనప్పుడు మరమ్మతులు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రహదారులను నెదర్లాండ్స్‌లో పరీక్షిస్తున్నారు. ఇలాంటివి మనదగ్గర కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? నిజమే... చాలా బాగుంటుంది. చూద్దాం మరి!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్