ట్రంప్ వ్యాఖ్యల దెబ్బ...అమెరికా మార్కెట్లు ఢమాల్
న్యూయార్క్: ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత జోరు పెరిగిన అమెరికా స్టాక్ మార్కెట్లు తాజాగా నష్టాల బాట పట్టాయి. రెండు రోజుల్లో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ముఖ‍్యంగా ఫైనాన్షియల్స్, రవాణా సంస్థల షేర్లు డీలా పడటంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎన్నికల తరువాత అధిక వడ్డీ రేట్లు అంచనాలతో భారీగా లాభపడిన ఎస్ & పి 500 ఆర్థిక ఇండెక్స్ 2.3 శాతం పడిపోయింది. జూన్ 27 తరువాత తొలిసారి ఆ స్తాయిలో దిగజారింది. ఈ నేపథ్యంలో డోజొన్స్ 59 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 19,827 వద్ద ముగియగా, ఎస్‌అండ్‌పీ అదే బాటలో నడిచింది. ఇక నాస్‌డాక్ మరింత అధికంగా 0.6 శాతం నష్టంతో 5,539 వద్ద స్థిరపడింది. నాలుగవ త్రైమాసికంలో రెట్టింపు లాభాల తర్వాత కూడా మోర్గాన్ స్టాన్లీ 3.8 శాతం పడిపోవడం గమనార్హం.
డాలర్ భారీగా బలపడటంతో చైనా వంటి దేశాలతో పోటీ పడటంలో అమెరికాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు డాలర్ను దెబ్బతీశాయి. దీంతో ప్రపంచ పది కరెన్సీలతో మారకంలో డాలరు ఉన్నట్టుండి నీరసించింది. దీంతో ఇటీవల రికార్డ్ స్థాయిలో బలపడిన డాలరు కూడా వెనకడుగు వేసింది. 15 ఏళ్ల గరిష్టంనుంచి దిగజారి 3.5 శాతం నష్టపోయింది. డాలరు ఇండెక్స్ నెల రోజుల కనిష్టం 100.53ను తాకింది. అటు బ్రెక్సిట్ పై ప్రధాని థెరిసా మే వ్యాఖ్యలతో
స్టెర్లిన్ 3 శాతం లాభపడిందవి. 1998 తరువాత ఇదే అతిపెద్ద లాభమని విశ్లేషకులు చెబుతున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా డాలర్ తో పోలిస్తే లాభాల్లో కొనసాగుతోంది. రూ.67.93 వద్ద ఉంది. చైనా యెన్ బారీగా లాభపడింది.
కాగా ట్రంప్ ఆర్థిక విధానాలు, అమెరికా విధానం లోపాలపై పటిష్ట చర్యల అంచనాలతో అమెరికా మార్కెట్లు ఇటీవల గణనీయంగా పెరిగాయని ఫండ్ మేనేజర్ల అంచనా. దీంతోపాటు ఈ వారంలో వెల్లడికానున్న ప్రధాన బ్యాంకులు సహా, రవాణా సంస్థల త్రైమాసిక ఆదాయ నివేదికలకై పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. ట్రంప్ 45వ అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాక యూఎస్ మార్కెట్లు రెండు నెలలపాటు ర్యాలీ బాటలో సాగిన సంగతి తెలిసిందే.