మన్మోహన్‌తో భేటీ కోసం ఎదురుచూస్తున్నా: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: వచ్చే నెలలో న్యూయార్క్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో జరగనున్న భేటీ కోసం ఎదురు చూస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఐదుగురు భారత జవాన్ల కాల్చివేత ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని పాదుగొలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మన్మోహన్‌తో చర్చిస్తానని చెప్పారు. సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో.. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ కార్యాలయంలో గురువారం ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను పునరుద్ధరించడానికి ఇరుదేశాలు తగిన చర్యలు చేపట్టాల్సి ఉందని నవాజ్ చెప్పారు.
ఒబామాను చూసి బుద్ధి తెచ్చుకోండి: బీజేపీ
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రధాని మన్మోహన్ చర్చలు జరపవద్దని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాను చూసి బుద్ధి తెచ్చుకోవాలని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘స్నోడెన్‌ను తమకు అప్పగించకుండా, ఆశ్రయం కల్పించినందుకు.. ఒబామా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరగాల్సిన చర్చలను రద్దు చేసుకున్నారు. మరి ఐదుగురు భారత సైనికులను దారుణంగా కాల్చిచంపిన పాక్ పాలకులతో మనమెందుకు చర్చించాలి’’ అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి ప్రశ్నించారు.