navaj shareef
-
పాకిస్తాన్లో అంతర్యుద్ధం?
కరాచీ: ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుండగా మరోపక్క ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఆర్మీకి, పాక్ పోలీసులకు మధ్య గొడవలు పెరిగి కాల్పులకు దారితీశాయి. ఇంటర్నేషనల్ హెరాల్డ్ తన తాజా ట్వీట్లో పాక్‌లో సివిల్ వార్ ఆరంభమైందని వ్యాఖ్యానించింది. కరాచీలో సింధ్ పోలీసులకు, పాక్ ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పది మంది పోలీసులు మరణించినట్లు ఇంటర్నేషనల్ హెరాల్డ్ నివేదించింది. సింధ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్ అహ్మద్ మహర్‌ను ఆర్మీ నిర్బంధించడంతో గొడవ మొదలైందని సమాచారం. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు మహ్మద్ సఫ్దార్ను అరెస్టు వ్యవహారంలో మహర్‌ను నిర్బంధించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనలపై పాక్ ప్రధాని, ప్రభుత్వం స్పందించలేదు. సఫ్దార్ అరెస్ట్ కోసం.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇటీవల ఏర్పాటు చేసిన పీడీఎం వేదికపై నవాజ్ షరీఫ్ కూతురు మరియం, ఆమె భర్త సఫ్దార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీకి నచ్చని ‘ఓటుకు విలువ ఇవ్వండి’ అని సఫ్దార్ నినాదాలు చేశారని, దీంతో కేసు నమోదైందని తెలిసింది. ఈ కేసులోనే సఫ్దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే సఫ్దార్ను అరెస్ట్‌చేసేలా పోలీసులకు ఉత్వర్వులు ఇవ్వాలని సింధ్ పోలీస్ ఐజీపీ మహర్‌పై సైన్యం ఒత్తిడి చేసిందని, అందుకోసం ఆయనను సైన్యం నిర్బంధించిందని సింధ్ మాజీ గవర్నర్ మహ్మద్ జుబేర్ ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి అయిన మహర్ నిర్బంధం విషయం తెల్సి ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారని సమాచారం. ఈ సందర్భంగా సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగాయని, పది మంది పోలీసులు మరణించారని తెలుస్తోంది. సైన్యం కాల్పులకు నిరసనగా ఏఐజీ ఇమ్రాన్‌సహా సీనియర్ పోలీసు అధికారులు విధులను బహిష్కరించి సెలవు తీసుకున్నారు. అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మహర్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. 10 రోజులదాకా సెలవు కోసం దరఖాస్తు చేసుకోరాదని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ గొడవకు కారణమైన అంశాలపై విచారణ జరపాలని ఆర్మీ చీఫ్ జనరల్ కమార్‌జావెద్ బజ్వా ఆదేశించారు. నిరసనల్లో భారత జెండా ఇటీవల పాక్‌లో జరిగిన భారీ నిరసనల్లో భారత జాతీయజెండాలు చేతబూనారని బుధవారం ట్విట్టర్లో కొంతమంది పోస్ట్‌లు పెట్టారు. వేలాది మంది జనం గుమికూడిన ఈ ఫొటోల్లో కొందరి చేతిలో మువ్వన్నెల జెండాలున్నాయి. పాక్‌కు చెందిన పాకిస్తాన్ అవామీ తెహ్రీక్ పార్టీ జెండాలో అవే రంగులుంటాయని, అవి ఆ జెండాలని కొందరు స్పందించారు. పాక్‌లో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆహార కొరత వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ గద్దె దిగాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆందోళనలను అణిచివేస్తోంది. -
షరీఫ్‌పై అరెస్టు వారంట్
ఇస్లామాబాద్: అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. పనామా పేపర్ల కుంభకోణంతో పదవి కోల్పోయిన షరీఫ్‌ను అవినీతి ఆరోపణలపై అక్కడి అకౌంటబులిటీ కోర్టు విచారణ చేస్తోంది. కోర్టు విచారణకు షరీష్ పలుమార్లు హాజరు కాకపోవడంతో గురువారం ఆయనపై న్యాయస్థానం బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను జారీచేసింది. తన భార్య కుల్సుమ్కు కేన్సర్ చికిత్స నిమిత్తం లండన్‌లో ఉంటున్నందన కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని షరీఫ్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఆ విజ్ఞప్తిని జడ్జి తోసిపుచ్చారు. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేశారు. షరీఫ్ కుమార్తె మరియమ్, అల్లుడు సఫ్దార్‌లు కోర్టుకు హాజరయ్యారు. కానీ షరీఫ్ గైర్హాజరయ్యారు. షరీఫ్‌కు హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఎన్ఏబీ డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్ సర్దార్ ముజఫర్ అబ్బాసీ ఆయన విజ్ఞప్తిని వ్యతిరేకించారు. ఇప్పటికే 15 రోజుల మినహాయింపును కోర్టు ఇచ్చిందని ఆ గడువు కూడా ఈ నెల 24తో ముగిసిందని కాబట్టి మళ్లీ మినహాయింపు ఇవ్వద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు షరీఫ్‌పై బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. దీంతోపాటు షరీఫ్ కుమారులు గైర్హాజరవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. -
కాశ్మీర్‌పై అమెరికా జోక్యం అవశ్యం: పాక్
ఇస్లామాబాద్: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం అవశ్యమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌పై మూడో దేశం (అమెరికా) జోక్యం చేసుకోవడం భారత్‌కు ఇష్టం లేనప్పటికీ, సమస్య పరిష్కారం కావాలంటే అగ్ర దేశం జోక్యం అవసరమేనన్నారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకోవడానికి బయల్దేరి వెళుతున్న నవాజ్ లండన్‌లో ఆదివారం ఈ వ్యాఖ్య చేశారు. భారత్, పాకిస్థాన్‌ల వద్ద అణ్వాయుధాలున్నాయని, ఇది అణ్వాయుధ అలికిడి కలిగిన ప్రాంతమని ఆయన అన్నారు.ఐరాస సమావేశానికి వెళ్లి వస్తూ నవాజ్ న్యూయార్క్‌లోనూ పర్యటించినప్పటికీ, పాక్ ప్రధాని అమెరికాలో అధికారిక పర్యటన జరపడం గత ఐదేళ్లలో ఇదే ప్రథమం. ఎవరి జోక్యాన్నీ సహించం: భారత్ అమెరికా జోక్యం చేసుకొని కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలన్న పాక్ ప్రధాని నవాజ్ షరీష్ డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక అంశమైన కాశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. నవాజ్ ఆయుధ పోటీ గురించి మాట్లాడే ముందు కవ్వింపు చర్యలే చర్చలకు విఘాతం కలిగిస్తున్న విషయం గ్రహించాలన్నారు. -
మన్మోహన్‌తో భేటీ కోసం ఎదురుచూస్తున్నా: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: వచ్చే నెలలో న్యూయార్క్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో జరగనున్న భేటీ కోసం ఎదురు చూస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఐదుగురు భారత జవాన్ల కాల్చివేత ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని పాదుగొలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మన్మోహన్‌తో చర్చిస్తానని చెప్పారు. సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో.. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ కార్యాలయంలో గురువారం ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను పునరుద్ధరించడానికి ఇరుదేశాలు తగిన చర్యలు చేపట్టాల్సి ఉందని నవాజ్ చెప్పారు. ఒబామాను చూసి బుద్ధి తెచ్చుకోండి: బీజేపీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రధాని మన్మోహన్ చర్చలు జరపవద్దని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాను చూసి బుద్ధి తెచ్చుకోవాలని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘స్నోడెన్‌ను తమకు అప్పగించకుండా, ఆశ్రయం కల్పించినందుకు.. ఒబామా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరగాల్సిన చర్చలను రద్దు చేసుకున్నారు. మరి ఐదుగురు భారత సైనికులను దారుణంగా కాల్చిచంపిన పాక్ పాలకులతో మనమెందుకు చర్చించాలి’’ అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి ప్రశ్నించారు.