పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం? | Pakistan Heading For A Civil War | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం?

Published Thu, Oct 22 2020 4:31 AM | Last Updated on Thu, Oct 22 2020 8:29 AM

Pakistan Heading For A Civil War - Sakshi

పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్‌ అహ్మద్‌మహర్‌

కరాచీ: ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్‌ క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుండగా మరోపక్క ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఆర్మీకి, పాక్‌ పోలీసులకు మధ్య గొడవలు పెరిగి కాల్పులకు దారితీశాయి. ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ తన తాజా ట్వీట్‌లో పాక్‌లో సివిల్‌ వార్‌ ఆరంభమైందని వ్యాఖ్యానించింది.

కరాచీలో సింధ్‌ పోలీసులకు, పాక్‌ ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పది మంది పోలీసులు మరణించినట్లు ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ నివేదించింది. సింధ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్‌ అహ్మద్‌ మహర్‌ను ఆర్మీ నిర్బంధించడంతో గొడవ మొదలైందని సమాచారం. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అల్లుడు మహ్మద్‌ సఫ్దార్‌ను అరెస్టు వ్యవహారంలో మహర్‌ను నిర్బంధించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనలపై పాక్‌ ప్రధాని, ప్రభుత్వం స్పందించలేదు.

సఫ్దార్‌ అరెస్ట్‌ కోసం..
పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇటీవల ఏర్పాటు చేసిన పీడీఎం వేదికపై నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం, ఆమె భర్త సఫ్దార్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ఆర్మీకి నచ్చని ‘ఓటుకు విలువ ఇవ్వండి’ అని సఫ్దార్‌ నినాదాలు చేశారని, దీంతో కేసు నమోదైందని తెలిసింది. ఈ కేసులోనే సఫ్దార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తక్షణమే సఫ్దార్‌ను అరెస్ట్‌చేసేలా పోలీసులకు ఉత్వర్వులు ఇవ్వాలని సింధ్‌ పోలీస్‌ ఐజీపీ మహర్‌పై సైన్యం ఒత్తిడి చేసిందని, అందుకోసం ఆయనను సైన్యం నిర్బంధించిందని సింధ్‌ మాజీ గవర్నర్‌ మహ్మద్‌ జుబేర్‌ ఆరోపించారు.

పోలీస్‌ ఉన్నతాధికారి అయిన మహర్‌ నిర్బంధం విషయం తెల్సి ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారని సమాచారం. ఈ సందర్భంగా సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగాయని, పది మంది పోలీసులు మరణించారని తెలుస్తోంది. సైన్యం కాల్పులకు నిరసనగా ఏఐజీ ఇమ్రాన్‌సహా సీనియర్‌ పోలీసు అధికారులు విధులను బహిష్కరించి సెలవు తీసుకున్నారు. అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మహర్‌ తన సెలవును వాయిదా వేసుకున్నారు. 10 రోజులదాకా సెలవు  కోసం దరఖాస్తు చేసుకోరాదని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ గొడవకు కారణమైన అంశాలపై విచారణ జరపాలని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమార్‌జావెద్‌ బజ్వా ఆదేశించారు.

నిరసనల్లో భారత జెండా
ఇటీవల పాక్‌లో జరిగిన భారీ నిరసనల్లో భారత జాతీయజెండాలు చేతబూనారని బుధవారం ట్విట్టర్‌లో కొంతమంది పోస్ట్‌లు పెట్టారు. వేలాది మంది జనం గుమికూడిన ఈ ఫొటోల్లో కొందరి చేతిలో మువ్వన్నెల జెండాలున్నాయి. పాక్‌కు చెందిన పాకిస్తాన్‌ అవామీ తెహ్రీక్‌ పార్టీ జెండాలో అవే రంగులుంటాయని, అవి ఆ జెండాలని కొందరు స్పందించారు. పాక్‌లో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆహార కొరత వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్రాన్‌ గద్దె దిగాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆందోళనలను అణిచివేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement