ఇస్లామాబాద్: అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. పనామా పేపర్ల కుంభకోణంతో పదవి కోల్పోయిన షరీఫ్‌ను అవినీతి ఆరోపణలపై అక్కడి అకౌంటబులిటీ కోర్టు విచారణ చేస్తోంది. కోర్టు విచారణకు షరీష్ పలుమార్లు హాజరు కాకపోవడంతో గురువారం ఆయనపై న్యాయస్థానం బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను జారీచేసింది. తన భార్య కుల్సుమ్‌కు కేన్సర్ చికిత్స నిమిత్తం లండన్‌లో ఉంటున్నందన కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని షరీఫ్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఆ విజ్ఞప్తిని జడ్జి తోసిపుచ్చారు.
తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేశారు. షరీఫ్ కుమార్తె మరియమ్, అల్లుడు సఫ్దార్‌లు కోర్టుకు హాజరయ్యారు. కానీ షరీఫ్ గైర్హాజరయ్యారు. షరీఫ్‌కు హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఎన్‌ఏబీ డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్ సర్దార్ ముజఫర్ అబ్బాసీ ఆయన విజ్ఞప్తిని వ్యతిరేకించారు. ఇప్పటికే 15 రోజుల మినహాయింపును కోర్టు ఇచ్చిందని ఆ గడువు కూడా ఈ నెల 24తో ముగిసిందని కాబట్టి మళ్లీ మినహాయింపు ఇవ్వద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు షరీఫ్‌పై బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. దీంతోపాటు షరీఫ్ కుమారులు గైర్హాజరవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment