కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం అవశ్యమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు.
ఇస్లామాబాద్: కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం అవశ్యమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌పై మూడో దేశం (అమెరికా) జోక్యం చేసుకోవడం భారత్‌కు ఇష్టం లేనప్పటికీ, సమస్య పరిష్కారం కావాలంటే అగ్ర దేశం జోక్యం అవసరమేనన్నారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకోవడానికి బయల్దేరి వెళుతున్న నవాజ్ లండన్‌లో ఆదివారం ఈ వ్యాఖ్య చేశారు. భారత్, పాకిస్థాన్‌ల వద్ద అణ్వాయుధాలున్నాయని, ఇది అణ్వాయుధ అలికిడి కలిగిన ప్రాంతమని ఆయన అన్నారు.ఐరాస సమావేశానికి వెళ్లి వస్తూ నవాజ్ న్యూయార్క్‌లోనూ పర్యటించినప్పటికీ, పాక్ ప్రధాని అమెరికాలో అధికారిక పర్యటన జరపడం గత ఐదేళ్లలో ఇదే ప్రథమం.
ఎవరి జోక్యాన్నీ సహించం: భారత్
అమెరికా జోక్యం చేసుకొని కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలన్న పాక్ ప్రధాని నవాజ్ షరీష్ డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక అంశమైన కాశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. నవాజ్ ఆయుధ పోటీ గురించి మాట్లాడే ముందు కవ్వింపు చర్యలే చర్చలకు విఘాతం కలిగిస్తున్న విషయం గ్రహించాలన్నారు.