రాష్ట్రపతి వద్దకు పెద్దనోట్ల రగడ!
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆకస్మిక సంచలన నిర్ణయంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీలకతీతంగా ఉమ్మడిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువాలని నిర్ణయించినట్టు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలతో తాను మాట్లాడానని ఆమె తెలిపారు.
పెద్దనోట్ల రద్దు అనాగరికమని, ఈ చర్యను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. సామాన్యులకు ఊరట కలిగేలా రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని చెప్పారు. ఈ విషయమై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు.