![ఉరితీసేలోగా పీజీ పట్టా ఇవ్వలేం - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/3/61437473365_625x300_0.jpg.webp?itok=MLN2t4_Z)
ఉరితీసేలోగా పీజీ పట్టా ఇవ్వలేం
నాగ్పూర్: ఈ నెల 30న ఉరిశిక్ష అమలు ఖాయమైన నేపథ్యంలో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ చివరి కోరిక తీరకుండానే చనిపోనున్నారు. గడిచిన 21 ఏళ్లుగా జైలులోనే ఉన్న ఆయన.. రెండు పీజీ కోర్సులు పూర్తిచేశారు. అరెస్టుకు ముందు ఛార్టర్డ్ అకౌంటెంట్ గా మెమన్ కు మంచి పేరుండేది. జైలులోనూ తన పఠనాసక్తిని కొనసాగించిన ఆయన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు పాస్ అయ్యారు.
చనిపోయేలోగా ఎంఏ ఇంగ్లీష్ పట్టా తీసుకోవాలనుకుంటున్నట్లు మెమన్.. జైలు అధికారులకు చెప్పగా వారు యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. అయితే ఇప్పటికిప్పుడు పీజీ పట్టాలు ఇవ్వలేమని, దానికి కొంత సమయం పడుతుందని, అదికూడా ఈ నెల 30లోగా పట్టా అందించడం అసాధ్యమని ఇగ్నో అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆఖరి కోరిక తీరకుండానే మెమన్ ఉరి కంబం ఎక్కనున్నారు.