అఖిలేశ్‌ను పెంచింది ఈ ‘శకుని మామే’..!
- పార్టీలో పరిణామాలపై ఎంపీ అమర్ సింగ్ భావోద్వేగం
లక్నో: ‘అఖిలేశ్ నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి నాకు తెలుసు. అతని చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం.. అన్నింటిలోనూ తోడ్పడ్డా. ‘నా’ అనుకున్నవాళ్లే మనల్ని ద్వేషిస్తే, మనల్ని వద్దనుకుంటే ఎంత బాధపడతామోకదా! ప్రస్తుతం నాదీ అలాంటి పరిస్థితే. అఖిలేశ్ నా గురించి మాట్లాడేవన్నీ వింటే నా గుండె బరువెక్కిపోతుంది..’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అమర్‌సింగ్. (సమయం లేదు మిత్రమా.. త్యాగం తప్పదు)
పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీ నుంచి లక్నో వచ్చిన అమర్‌సింగ్.. ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ‘మరో మాట లేకుండా నన్ను పార్టీ నుంచి గెంటేయాలని అఖిలేశ్ డిమాండ్ చేయడం బాధాకరం. సొంతవాళ్లే మనని ద్వేషిస్తూ ఆ బాధ వర్ణనాతీతం. నిజానికి నాకున్నవి రెండే రెండు కోరికలు. ఒకటి పార్టీలో పెద్దాయనే(ములాయమే) సుప్రీంగా ఉండాలి. రెండు, అఖిలేశ్ రాజకీయాల్లో ఇంకా ఉన్నతస్థానానికి ఎదగాలి. ఇంతకు మించి నాకేదీ అక్కర్లేదు’ అని అమర్‌సింగ్ అన్నారు. (బాబాయ్ అబ్బాయ్ భేటీ)
ఇదిలాఉంటే, ఢిల్లీ నుంచి తిరిగివస్తోన్న తండ్రి(ములాయం)కి లక్నో ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకుదామనుకున్న సీఎం అఖిలేశ్.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ములాయం వెంట అమర్‌సింగ్ కూడా ఉండటమే అందుకు కారణమని, ‘శకుని మామ వెంటుంటే మనమెలా వెళతాం?’అని అఖిలేశ్ వ్యాఖ్యానించినట్లు ఆయన అనునాయులు పేర్కొన్నారు. తండ్రి ప్రాపకంతో తనకు వ్యతిరేకంగా ఎత్తులువేస్తోన్న అమర్‌సింగ్‌ను అఖిలేశ్ ‘శకుని మామ’గా అభిర్ణించడం పార్టీలోని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. (టార్గెట్ 300: అఖిలేశ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?)