‘బీజేపీ స్నేహంతో పాతికేళ్లు వేస్ట్ చేశాం’
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ మీద తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ బీజేపీతో స్నేహం కోసం పాతికేళ్లు అనవసరంగా ‘వేస్ట్’ చేసిందని వ్యాఖ్యానించారు. తమకు గౌరవం లేదని భావిస్తే తక్షణం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే భాగస్వామ్య పార్టీకి వెన్నుపోటు పొడవబోమని, వాళ్లను బ్లాక్ మెయిల్ కూడా చేయమని ఆయన అన్నారు. జూన్ నెలతో తమ పార్టీ స్థాపించి 50 ఏళ్లయిందని, అందులో సగం కాలం తాము బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నామని చెప్పారు. ఇన్నాళ్లుగా ఒకరి చేతులు ఒకరు పట్టుకునే ఉన్నా.. గత ఎన్నికల నాటి పరిణామాల్లాంటివి చూస్తే ఇప్పుడు ఈ పాతికేళ్లు పొత్తు పెట్టుకుని సమయం వృథా చేశామా అనిపిస్తోందని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
తాను ఇప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని, ఇద్దరం కలిసి ఇటీవలే ‘మాతోశ్రీ’ (ఠాక్రేల నివాసం)లో సమావేశమై.. కలిసి భోజనం చేశామని తెలిపారు. బుధవారంతో ఉద్ధవ్ ఠాక్రేకు 56 ఏళ్లు నిండుతాయి. ప్రభుత్వంలో ఉన్న కొన్ని శక్తులు అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అందుకే ప్రభుత్వంలో ఉండి కూడా తాము ఇలా మాట్లాడాల్సి వస్తోందన్నారు. తనకు, తన పార్టీకి తగినంత గౌరవం లభించడం లేదని అనుకున్న మరోక్షణం అధికారం నుంచి బయటకు వచ్చేస్తామని, అయితే ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మెయిల్ చేయబోమని తెలిపారు.
క్లీన్ ఇమేజ్ ఉన్నంతమాత్రాన సరిపోదు...
మోదీ ప్రభుత్వం తమకు క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పుకోడాన్ని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. బిహార్లో లాలు ప్రసాద్కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకపోయినా.. ఆయన పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించిందని గుర్తు చేశారు. అలాగే తమిళనాడులో జయలలిత మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, భారీ అవినీతి ఆరోపణలు ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ప్రజలు బీజేపీని ఎందుకు తిరస్కరించారో ఆ పార్టీ నాయకత్వం గుర్తించాలని అన్నారు. ఆయా రాష్ట్రాలలో నాయకుల హామీలను గానీ, పెద్దపెద్ద ప్రసంగాలను గానీ పట్టించుకోలేదని... కేవలం తమ స్థానిక నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. దాన్నిబట్టి త్వరలో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి.. స్థానిక నాయకత్వం పేరుతో తాను ముందుకొస్తానన్న సూచనను ఠాక్రే ఇచ్చారు.