కళాశాలలో ఆయుధాలు?
అసెంబ్లీని తప్పుదోవ పట్టించారంటూ కేరళ సీఎంపై ప్రతిపక్షాల దాడి
కోచి: కేరళలోని కోచిలో ఓ కళాశాలలో ఆయుధాలు పట్టుబడ్డాయన్న ఆరోపణలు శనివారం రాజకీయ దుమారం రేపాయి. సీఎం పినరయి విజయన్ ఈ వ్యవహారంలో అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. మహరాజా కళాశాల నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలను సీఎం శుక్రవారం అసెంబ్లీలో తోసిపుచ్చారు. అక్కడ ఎలాంటి ఆయుధాలు దొరకలేదని, నిర్మాణ సామగ్రి మాత్రమే ఉందని తెలిపారు.
కళాశాల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉందని మీడియాలో వార్తలు వెలువడటంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ స్పందిస్తూ...సీఎం అసెంబ్లీతో పాటు, ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అయితే అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందే తాను ఎఫ్‌ఐఆర్‌ను చూశానని సీఎం అలెప్పీలో వెల్లడించారు.
ఈ వ్యవహారంపై శనివారం అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ ప్రాబల్యమున్న ఆ కళాశాల ఆయుధాగారంగా మారిందని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఆరోపించింది. ఈ విషయంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ వినతిని స్పీకర్ తిరస్కరించడంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.