చంద్రబాబులో వెంకయ్యకు ఏం నచ్చింది?
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య తీవ్రంగా తప్పుబట్టారు. ‘చంద్రబాబులో వెంకయ్యకు నచ్చిందేంటో చెప్పాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమా? రైతులకు నష్టం చేసే విధానాలు అవలంబించడమా? ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమా? ప్రజాధనం దుబారా చేయడమా? ఇవేనా చంద్రబాబులో వెంకయ్యకు నచ్చిన అంశాలు?’ అంటూ సీ రామచంద్రయ్య నిలదీశారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నందుకే చంద్రబాబును వెంకయ్య అభినందించారా? అని ప్రశ్నించారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీని అభినందించేందుకే నిన్నటి శంకుస్థాపన సభ పెట్టారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విభజన చట్టంలో ఉన్నదేనని చెప్పారు. కమిషన్ల కోసమే పోలవరాన్ని రాష్ట్రం చేపట్టేలా చంద్రబాబు చూసుకున్నారని, అందుకు సహకరించినందుకే అరుణ్‌జైట్లీని ఆయన సన్మానించారని మండిపడ్డారు.