వాట్సాప్ పాలసీపై హైకోర్టులో సవాల్
వాట్సాప్ పాలసీపై హైకోర్టులో సవాల్
Published Wed, Aug 31 2016 11:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
పాపులర్ మెసేజింగ్ సర్వీసు యాప్ వాట్సాప్ ఇటీవల తీసుకున్న ప్రైవేట్ పాలసీ మార్పులపై సవాళ్లు ఎదురవుతున్నాయి. పేరెంట్ కంపెనీ ఫేస్బుక్తో వాట్సాప్ డేటా షేరింగ్ను సవాల్ చేస్తూ ఓ ఇద్దరు విద్యార్థులు కోర్టుకెక్కారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, 2012లో నిర్ణయించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, లక్షలాది యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శ్రేయా సేథీ, కర్మన్య సింగ్ సారిన్ అనే వాట్సాప్ యూజర్లు ఢిల్లీ హైకోర్టులో ఈ పిల్ను ఫైల్ చేశారు.
ఈ పిల్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్తో కూడిన బెంచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)లకు నోటీసులు జారీచేసింది. సెప్టెంబర్ 14లోపు ఈ పిల్పై తమ స్పందన తెలపాలని ఆదేశించింది. గతవారంలోనే ఈ కొత్త ప్రైవసీ పాలసీని వాట్సాప్ ప్రకటించింది. పేరెంట్ కంపెనీతో యూజర్ల డేటాను షేర్ చేసుకోనున్నట్టు వెల్లడించింది. ఫోటోలు, మెసేజ్లు మాత్రం షేర్ చేయడం లేదని వాట్సాప్ తెలిపింది.
సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీని కమర్షియల్ అడ్వర్టైజింగ్కు, మార్కెటింగ్కు యూజర్ల డేటాను వాడుకోనున్నట్టు ఫేస్బుక్, వాట్సాప్లు వెల్లడించాయి. అయితే ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని, ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపించారు.
Advertisement
Advertisement