
'రండి.. నన్ను కౌగిలించుకోండి'
ముంబై: 'ఇస్లామోఫోబియా'.. ఇస్లాం ధర్మం పట్ల, దాన్ని అనుసరించేవారి పట్ల అపనమ్మకం లేదా భయం కలిగి ఉండటమే ఈ పదానికి అర్థం అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వివరిస్తోంది. ప్రపంచం కుగ్రామంగా మారినప్పటికీ... మనుషుల మధ్య మతం అడ్డుగోడగా నిలిచిన సంద్భాలు అనేకం. 'ఫలానా కులం వారికైతేనే ఇల్లు అద్దెకిస్తాం', 'ఫలానా మతం వారికి ఫ్లాట్ ఇవ్వలేం' అని అభివృద్ధి చెందిన నగరాల్లో సైతం బోర్డులు కనిపించడం ఇందుకు నిదర్శనం. ఇకనైనా ఇలాంటివి కనిపించొద్దని కోరుకుంటూ వింత ప్రయోగానికి సిద్ధమయ్యాడు మాజిమ్ ముల్లా అనే యువకుడు.
ముంబైలో అత్యంత రద్దీగా ఉండే గేట్ వే ఆఫ్ ఇండియాకు సమీపంలో ఫుట్పాత్ వద్ద మాజిమ్ కళ్లకు గంతలు కట్టుకుని నిల్చున్నాడు. చేతిలో ఓ ప్లకార్డు. అందులో ఇలా రాసుంది.. 'నేను ముసల్మాన్ను. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. నన్ను కూడా మీరు నమ్ముతారా? అయితే రండి.. నన్ను కౌగిలించుకోండి' అని.
మాజిమ్ చర్య కొందరిని ఆశ్చర్యానికి గురి చేయగా, చాలా మంది అతడ్ని కౌగిలించుకుని వెళ్లారు. ఇంకొందరు అతడితో ముచ్చట పెట్టారు. ఎందుకిదంతా? అని అడిగితే.. 'జనం ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికే.. ' అంటూ మొత్తం కథంతా వివరిస్తాడు. గత ఫిబ్రవరిలో ఓ కెనడియన్ ముస్లిం యువకుడు కూడా ఇలా కళ్లకు గంతలు కట్టుకుని నన్ను కౌగిలించుకోండంటూ తెలిపిన ఆగ్రహపూరిత నిరసన అప్పట్లో సంచలనం రేపింది.