ఆర్నాబ్‌ కే అంత భద్రత ఎందుకు? | why Arnab Goswami to be provided Y category security | Sakshi
Sakshi News home page

ఆర్నాబ్‌ కే అంత భద్రత ఎందుకు?

Published Tue, Oct 18 2016 3:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

ఆర్నాబ్‌ కే అంత భద్రత ఎందుకు?

ఆర్నాబ్‌ కే అంత భద్రత ఎందుకు?

న్యూఢిల్లీ: టైమ్స్ నౌ న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి ఏకంగా 22 మంది భద్రతా సిబ్బందితో ‘వై’ కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కల్పించాల్సి వచ్చిందో జర్నలిస్టు పెద్దలందరూ ‘న్యూస్ అవర్’ కార్యక్రమంలో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ప్రాణాలకు ముప్పున్న కారణంగానే ఈ రక్షణ కల్పించాల్సిన అసరం వచ్చిందని కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచే భద్రతా సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నందున ఆర్నాబ్ గోస్వామికి ఎందుకు? వై ? భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఒక్క జర్నలిస్టులకే కాకుండా మొత్తం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు చర్చించి, సమాధానాలు రాబట్టాల్సిన అంశాలు ఏమిటంటే.....
 

 1. ఆర్నాబ్ గోస్వామి ప్రాణాలకు ముప్పుందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎలా తెలిసింది? ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చిన సందేశాలనుగానీ, సమాచారాన్నిగానీ వారు మధ్యలో ట్రేస్ చేశారా?

 2. ఆర్నాబ్ గోస్వామి వ్యాఖ్యలకు ఏ ఉగ్రవాద సంస్థ నొచ్చుకుంది? ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ఆయన ప్రాణాలకు ముప్పుంది?

 3. ‘వై’ కేటగిరీ భద్రతనే ఆయనకు ఎందుకు కల్పించాలనుకున్నారు? జెడ్ లేదా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఎందుకు కల్పించడం లేదు?

 4. తమకు వ్యతిరేకంగా ఆర్నాబ్ చేసిన ఏ వ్యాఖ్యలు తీవ్రమైనవిగా ఉగ్రవాద సంస్థలు భావించాయి? ఇవి తెలుసుకుంటే ఎలాంటి వ్యాఖ్యలు తక్కువ తీవ్రతగలవో జర్నలిస్టులు అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.

 5. టైమ్స్ నౌ ఛానెల్‌లో ఒక్క ఆర్నాబ్ గోస్వామి ప్రాణాలకు మాత్రమే ముప్పుందా? ఆయన సిబ్బంది ప్రాణాలకు ముప్పు లేదా? ఆయన్ని చంపేందుకు వచ్చే ఉగ్రవాదులు దాడి సందర్భంగా సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టరా?

 6. టైమ్స్ నౌ ఛానెల్‌లో చర్చల కోసం వచ్చే అతిథులకు ఎలాంటి ముప్పులేదా? వారంతా క్షేమంగానే ఉంటారా?

 7. ఆర్నాబ్ గోస్వామికి రక్షణ కల్పించడం కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఎంత ఖర్చు పెడుతున్నారు?

 8. ముకేశ్ అంబానీకి జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నందుకు ఆయన నుంచి15 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. మరీ ఆర్నాబ్ గోస్వామి నుంచి గానీ, ఆయనకు ఉద్యోగం ఇచ్చిన బెన్నెట్, కోల్‌మెన్ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు?

 9. ‘వై’ కేటగిరీ భద్రతా సిబ్బందికి సరైన శిక్షణ ఉందో, లేదో పరీక్షించారా? వారి ధరించే బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు నాణ్యమైనవేనా?
 

 దేశంలో జర్నలిస్టులకు కూడా వీఐపీల్లాగా భద్రతను కల్పించడంలో ఆర్నాబ్ గోస్వామి మొదటి వ్యక్తి కాదు. బీజేపీ ఎంపీ, పంజాబ్ కేసరి పత్రిక యజమాని అశ్విణి కుమార్ చోప్రాకు దేశంలోనే అత్యంత ఉన్నతమైన ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను కల్పించారు. ఆర్నాబ్ స్వామికన్నా చోప్రా భద్రతకు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఆయన తాత లాలా జగత్ నారాయణన్ 1981లో, ఆయన తండ్రి రమేశ్ చందర్ 1984లో హత్యకు గురయ్యారు. మరి అలాంటి ముప్పు ఇప్పుడు చోప్రాకు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్నారు. ఒక్క ఉగ్రవాదుల నుంచి ముప్పుందన్న కారణంగానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా జర్నలిస్టులకు భద్రతను కల్పిస్తున్నారు. దౌర్జన్యంగా డబ్బు దండుకున్నారన్న కేసులో మాజీ కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ నుంచి ముప్పుందన్న కారణంగా జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరికి ‘ఎక్స్’ కేటగిరీ కింద నలుగురు సెక్యూరిటీ గార్డులతో భద్రతను ఏర్పాటు చేశారు.

ఒక్క జర్నలిస్టులకే కాకుండా ఏ పౌరుడి ప్రాణాలకు ముప్పున్నా దేశ రాజ్యాంగం ప్రకారం ఆ పౌరుడికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానిది. అలాంటప్పుడు కేంద్రం నేరుగా జోక్యం చేసుకొని ఎందుకు భద్రతను కల్పిస్తుందో కూడా సమాధానం రాబట్టాలి. 2010 సంవత్సరం నుంచి దేశంలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వారంతా తమ ప్రాణాలకు ముప్పుందంటూ ఎంత మొత్తుకున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. జగేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్ గత జూన్ నెలలో తన ప్రాణాలకు ముప్పుందంటూ అధికారులకు మొరపెట్టుకున్నా, ఫేస్‌బుక్‌లో తనకున్న ప్రాణాపాయాన్ని తెలియజేసినా పట్టించుకోలేదు. ఫలితంగా గతేడాది జూన్ నెలలో జగేంద్ర సింగ్ హత్యకు గురయ్యారు. ప్రభుత్వం ఈ జర్నలిస్టులందరికి భద్రత కల్పించి ఉన్నట్టయితే వీరంతా నేడు బతికి ఉండేవారు కాదా?         ---------------  ఓ సెక్యులరిస్ట్ కామెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement