ట్రంప్ జిత్తులంటే ఇవే మరి!
ట్రంప్ జిత్తులంటే ఇవే మరి!
Published Wed, Feb 8 2017 1:50 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM
ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాను వదిలేసి, కొన్ని టెర్రరిస్టు సంస్థలను ప్రోత్సహిస్తున్న సౌదీ అరేబియా, టర్కీ దేశాలను కాదని సిరియా, ఇరాన్, ఇరాక్, యెమెన్, సూడాన్, సోమాలియా, లిబియా లాంటి ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రయాణ ఆంక్షలు విధించారబ్బా! అన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే ఆయన నక్క జిత్తులు ఏమిటో బయటపడ్డాయి.
ట్రావెల్ ఆంక్షలు విధించిన ఈ ఏడు ముస్లిం దేశాలతో ట్రంప్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రెండు లగ్జరీ భవనాలకు తన పేరును ఉపయోగించుకునేందుకు ట్రంప్ లైసెన్స్ ఇచ్చారు. అందుకు ఆయనకు 2015లో 50 లక్షల డాలర్లు రాయల్టీ కింద దక్కాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో ట్రంప్ బ్రాండ్‌తో రెండు రిసార్ట్‌లు నిర్మిస్తున్నారు.
ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పలు లగ్జరీ విల్లాస్, ఓ గోల్ఫ్ కోర్స్ నిర్మాణంలో డోనాల్డ్ ట్రంప్‌కు వ్యాపార భాగస్వామ్యం ఉందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. సౌదీ అరేబియాలో ఓ హోటల్ నిర్మించాలని ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ గతంలో ప్లాన్ తయారుచేసింది. అయితే దాన్ని ఇటీవల ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అయితే సౌదీ అరేబియా యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ అల్‌సౌద్‌తో గతంలో ట్రంప్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
టెర్రిరిస్టుల నుంచి ముప్పుందన్న కారణంగా ఈ ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ ఆంక్షలు విధించడం, ఇప్పుడు అది అమెరికా కోర్టులో చిక్కుకోవడం తెలిసిందే. పైగా ఈ ఏడు దేశాల నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదు. గత 40 ఏళ్లలో టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉందనే అనుమానం లేదా ఆరోపణలతో ఈ దేశాలకు చెందిన కేవలం 17 మందిని మాత్రమే అమెరికా అరెస్ట్ చేసింది. వారు పాల్గొన్న ఏ టెర్రరిస్టు ఘటనల్లో కూడా 40 ఏళ్లలో ఒక్కరూ చనిపోలేదు. మరెందుకు ఈ ఏడు దేశాలపైనే ఆయన ఆంక్షలు విధించారు? ఆయన అంతరంగం ఏమిటి? ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు ఆయన లోగుట్టు బయట పడుతుందేమో!
Advertisement