చైనాతో ఇప్పుడు కయ్యం ఎందుకు? | why tensions escaleted at india-china borders | Sakshi
Sakshi News home page

చైనాతో ఇప్పుడు కయ్యం ఎందుకు?

Published Sat, Jul 1 2017 4:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

చైనాతో ఇప్పుడు కయ్యం ఎందుకు?

చైనాతో ఇప్పుడు కయ్యం ఎందుకు?

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఎందుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి? వివాదాస్పదమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ లేదా లడక్‌ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా ఎలాంటి సరిహద్దు వివాదంలేని సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు రాజుకున్నాయి. ఎప్పుడూ ఇరువైపుల పదుల సంఖ్యలో కాపలా ఉండే సైనికుల సంఖ్య ఇప్పుడు మూడువేల మందికి ఎందుకు చేరుకుంది? ఒకసారి 1962లో ఎదురైన పరాభవాన్ని గుర్తుచేసుకోడంటూ భారత్‌ను చైనా హెచ్చరించడం, అప్పటి భారత్‌లాగానే ఇప్పుడూ భారత్‌ ఉందనుకోవడం పొరపాటంటూ భారత్‌ కూడా దీటుగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? చైనా సరిహద్దుల గుండా మానవ సరోవర యాత్రను కూడా నిలిపేయాల్సిన ఆగత్యం ఎందుకు ఏర్పడింది?
 
భారత్, భూటాన్, చైనా సరిహద్దులు కలిసే చోటును డోకో–లా అని భారత్, డాగ్లాంగ్‌ అని చైనా పిలుస్తోంది. వీటి సరిహద్దులను నిర్దేశిస్తూ 127 సంవత్సరాల క్రితమే, అంటే 1890 సంవత్సరంలో అప్పటి క్వింగ్‌ రాజ్యం, బ్రిటీష్‌ పాలకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 1895 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆంగ్లేయులు, చైనీయుల మధ్య కుదిరిన ఒడంబడికగా అప్పటి నుంచి పరిగణిస్తున్నారు. ఈ సరిహద్దులకు సమీపంలోనే ఉన్న టిబెట్‌లోని చుంబా లోయ చైనాకు వ్యూహాత్మకమైన ప్రదేశం. చైనా నుంచి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి సన్నటి డొంకదారి తప్ప మరేమీ లేదు. అక్కడికి మోటార్లపై వేగంగా చేరుకోవడానికి ఆ ప్రాంతంలో చైనా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది.
 
జూన్‌ నాలుగవ తేదీ రాత్రి భారత్‌ సైనికులు టిబెట్‌లోని చుంబా లోయలోకి చొచ్చుకుపోయి చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డగించారని చైనా ఆరోపిస్తోంది. అందుకు ప్రతీకారంగా కొన్ని రోజుల తర్వాత చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి జొరబడు రెండు బంకర్లలో ఓ బంకరును బుల్డోజర్‌తో కూల్చేశారని ఆ దేశ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగా నిర్మించారన్న కారణంగా తాము కూల్చేశామని చైనా సైన్యం సమర్థించుకుంటే ఆ బంకర్లు ఎప్పుడో నిర్మించినవని భారత్‌ వాదించింది. చైనా నిర్మిస్తున్న రోడ్డు వ్యూహాత్మకంగా భూటాన్‌కే ప్రమాదం. చైనాతో భూటాన్‌కు దౌత్య సంబంధాలు లేని కారణంగా భారత్‌ పంచన చేరిన ఆ దేశం రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాల్సిందిగా భారత్‌ను కోరి ఉండవచ్చు. అందుకు భారత సైన్యం స్పందించి ఉండవచ్చు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఏ దేశమూ వెల్లడించడం లేదు. 
 
సరిహద్దులు అతిక్రమించి రోడ్డు నిర్మాణం అడ్డుకున్నావంటూ భారత్‌పై చైనా, సరిహద్దుల్లోకి చొరబడి బంకరు కూల్చేశావంటూ చైనాపై భారత్‌ ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇవి తీవ్రస్థాయికి చేరుకోవడంతో వేలాది మంది సైనికుల మోహరింపుతో ముఖాముఖి తలపడే స్థాయికి చేరుకున్నాయి. సిక్కింకు సంబంధించినంతవరకు తమకు భారత్‌తో ఎలాంటి వివాదం లేదని, ఇప్పుడు కూడా తమ దేశం 1890 నాటి ఒప్పందాన్ని గౌరవిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేయడం గమనార్హం. అలాంటప్పుడు ఇరు దేశాలు ఎందుకు ఉద్రిక్తకు దారితీసే ప్రకటనలు చేస్తున్నాయి? 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాంగ విధానంలో దూకుడు స్వభావాన్నే ప్రదర్శిస్తోంది. అందుకే చల్లారిన కశ్మీరం మళ్లీ రగులుతోందని, ఇప్పుడు చైనాతో కయ్యానికి కాలుదువ్వుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశ సమస్యల నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు ఈ దూకుడు విధానమని వారంటున్నారు. 
 
అలాంటప్పుడు మరి చైనా ఎందుకు దూకుడు స్వభావం ప్రదర్శిస్తోంది? పాకిస్తాన్‌ మీదుగా చైనా నిర్మిస్తున్న ‘ఒకే బెల్ట్‌ ఒకే కారిడార్‌’ ప్రాజెక్టుకు భారత్‌ భవిష్యత్‌లో అడ్డు రాకూడదని ఉద్దేశంతో వ్యూహాత్మకంగా చైనా దూకుడు వైఖరిని అవలంబిస్తోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తుండగా, వివాదాస్పదమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత్‌ మౌలిక సౌకర్యాల నిర్మాణం పట్ల చైనా ఆగ్రహంతో ఉందని, ఆ అగ్రహాన్ని ఇక్కడ చూపిస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. భారత్‌ సైన్యం ప్రధానంగా సరిహద్దు కదలికలపై దష్టి పెట్టేలా చేసి సిక్కింలోని అపార సహజ వనరులను దోచుకుపోవాలని చైనా చూస్తోందంటూ ఢిల్లీ యూనివర్శిటీలోని పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ రాజేష్‌ దేవ్‌ అభిప్రాయపడ్డారు. 
 
వివరణ: భారత సైనికులు తమ భూభాగంలోకి వచ్చారంటూ చైనా సోషల్‌ మీడియాలో ప్రచురితమైన ఫొటోను పొరపాటున ప్రచురించినందుకు చింతిస్తున్నాం.. ఇప్పుడు ఆ చిత్రాన్ని తొలగించాం- సాక్షి.కామ్‌
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement