కేజ్రీవాల్‌కు ట్విట్టర్ షాక్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకోని షాక్ తగిలింది. ఈసారి అది ఎవరో వ్యక్తులు ఇచ్చింది కాదు.. ట్విట్టర్ ఇండియా ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఒక్కోదాన్నీ నెమ్మదిగా సస్పెండ్ చేస్తూ వచ్చింది. తాజాగా 'ఆప్ ఇన్ న్యూస్' అనే ట్విట్టర్ అకౌంటును సస్పెండ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ కూడా ట్విట్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ ఇండియాకు ఏమైందని ప్రశ్నించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్లను, దాని మద్దతుదారుల అకౌంట్లను రోజువారీగా ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఆప్ ఇన్ న్యూస్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని పార్టీ నాయకుడు జితేందర్ సింగ్ ట్వీట్ చేయడంతో.. దాన్ని ప్రస్తావిస్తూ తమను ట్విట్టర్ ఎందుకు టార్గెట్ చేసిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే దీనికి ట్విట్టర్ ఇండియా మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉండటంతో.. ఇప్పుడు అదే సోషల్ మీడియాకు దూరం కావడం కేజ్రీవాల్‌ను చాలా ఇబ్బంది పెడుతోంది.