చతుర్లు, విసుర్లు... ఉర్రూతలు
శాన్ హోసె: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో దూసుకుపోతున్నారు. ప్రతి అడుగులో తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ హెసె ఎస్ఏపీ సెంటర్ లో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ఆయన ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ఎన్నారైలు కరతాళధ్వనులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.
తనపై తానే ప్రశ్నలు సంధించుకుని సభికులతో సమాధానాలు రాబట్టారు. తన పాలనకు సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రవాసులను కోరారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించి ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ తనశైలిలో చతుర్లు, విసుర్లు కలగలపి ఉపన్యసించారు. ప్రవాస భారతీయులు తమ మేధాశక్తిని స్వదేశాభివృద్ధికి ధారపోయాలని ఉద్బోధించారు. 21వ శతాబ్దం ఇండియాదేనని ఉత్తేజపరిచారు. ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాలకు వరకు ఎదిగామని వివరించారు.
భారత్ యువశక్తిపై తనకున్న అపార నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు సంధించారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని హామీయిచ్చారు. దేశం కోసం జీవిస్తా, దేశం కోసం ప్రాణమిస్తా అంటూ మోదీ చేసిన ప్రసంగం ఎన్నారైలను ఉర్రూతలూగించింది. కాగా, మోదీ సభకు ఎన్నారైలు పోటెత్తారు. సభా ప్రాంగణం కిక్కిరిపోవడంతో చాలా మంది బయటే ఉండిపోవాల్సివచ్చింది.