నాకు మీ సర్టిఫికెట్ కావాలి: మోదీ
శాన్ హోసె: ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తానని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానిగా 16 నెలలు పనిచేసిన తనకు ఎన్నారైల సర్టిఫికెట్ కావాలని అడిగారు. కాలిఫోర్నియాలోని శాన్ హెసెలో ఎస్ఏపీ సెంటర్ లో ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
'ఒకప్పుడు ఢిల్లీకి అపరిచితుడిలా వచ్చాను. అప్పుడు పార్లమెంటుకు ఎలా వెళ్లాలో కూడా ఎవరినైనా అడగాల్సి వచ్చేది. 21వ శతాబ్దం ఎవరిది.. (ఈ ప్రశ్న అడగగానే అక్కడున్నవాళ్లంతా మోదీ.. మోదీ.. మోదీ.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు) భారతదేశానిదని మొత్తం ప్రపంచం అర్థం చేసుకుంది. ఈ మార్పు ఎక్కడినుంచి వచ్చింది? ఈ మార్పు మోదీ వల్ల రాలేదు.. ఈ మార్పు 125 కోట్ల మంది భారతీయుల సంకల్పం వల్ల వచ్చింది. 125 కోట్ల మంది భారతీయులంతా మనస్సులో సంకల్పం చెప్పుకొన్నారు. వాళ్లు సంకల్పం చెప్పుకొంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు.
ఈ ప్రపంచమంతా నిన్నటివరకు భారతదేశాన్ని ఎలా చూసినా ఇప్పుడు మాత్రం కేంద్ర బిందువులా చూస్తోంది. ఒకప్పుడు భారతదేశం ప్రపంచం వైపు చూసేది.. అందరూ ఎలాగోలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేందుకు ఆరాటపడుతోంది. చిన్న సంఘటన జరిగితే చాలు.. మీ మొబైల్ ఫోన్లో వెంటనే ఎలర్ట్ వచ్చేస్తుంది. దేశంలో వచ్చిన ఈ మార్పు వల్ల దేశంలో జరిగిన ప్రతి విషయం మీకు తెలిసిపోతుంది. స్టేడియంలో కూర్చుని క్రికెట్ చూస్తున్నా.. బాల్ ఎటు వెళ్తోందో, అంపైర్ ఏం చెబుతున్నాడో కష్టపడి చూడాల్సి వచ్చేది. కానీ టీవీలో మాత్రం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో ఉండి దేశాన్ని చూసేవాళ్లకు తెలియదు గానీ, మీకు మాత్రం దేశంలో ఏం జరుగుతోందో, లేదో తెలిసిపోతుంది.
మోదీ ఏం చేస్తున్నాడో అంతా మీకు తెలుసు. నేను శ్రమపడటంలో ఏమాత్రం వెనకడుగు వేయను. దేశప్రజలు నాకిచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రతి క్షణం, శరీరంలో ప్రతి కణం నూటికి నూరుశాతం పనిచేస్తాను. ఇప్పుడు 16 నెలల తర్వాత నాకు మీ సర్టిఫికెట్ కావాలి. నా ప్రమాణం నేను నిలబెట్టుకున్నానా లేదా? శ్రమ పడుతున్నానా లేదా? దేశం కోసం చేస్తున్నానా? మీరు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నానా లేదా? మన దేశంలో రాజకీయ నాయకుల మీద కొద్ది కాలానికే ఆరోపణలు వస్తాయి. ఆయన 50 కోట్లు, ఈయన 100 కోట్లు తీసుకున్నాడని అంటారు. కొడుకు 150 కోట్లు, కూతురు 500 కోట్లు, అల్లుడు వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడని అంటారు. సవతి తమ్ముడు కాంట్రాక్టులు, ఇంకొకళ్లు ఇంకోటి తీసుకున్నారని విని విని మీ చెవులు దిబ్బళ్లు పడిపోయాయా, అవినీతి మీద మీకు చికాకు పుట్టిందా లేదా.. నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. నా మీద ఏమైనా ఆరోపణలున్నాయా?
నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. జీవించినా దేశం కోసమే.. మరణించినా దేశం కోసమే.. మన దేశం శక్తి, సామర్థ్యాలతో నిలబడింది. ఇంత ఆత్మవిశ్వాసం మీకు ఎక్కడినుంచి వచ్చింది అడుగుతారు. మీ దేశం ముందుకెళ్తుందని ఎలా తెలుసని అంటారు. నాకు మాత్రం పూర్తిగా విశ్వాసం ఉంది. నమ్మకం ఎందుకంటే, నా దేశం యువదేశం. ఏదైనా దేశంలో 65 శాతం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవాళ్లయితే ఆ దేశం ఏం చేయలేదు? 800 మిలియన్ల యువత ఉన్నప్పుడు 1600 భుజాలు కలిస్తే.. ఏం చేయలేవు? ఇక ఈ దేశం వెనకబడి ఉండలేద'ని పేర్కొన్నారు.
ఇంకా.. ''ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకు మనం ఎదిగాం. భారతదేశం మార్స్ మిషన్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఈ ఘనత ఒక్క భారతదేశానిదే. మన జాతి శక్తి సామర్థ్యాలేంటో చూడండి. ప్రపంచ బ్యాంకు కానివ్వండి, మూడీస్ కానివ్వండి, మరే ఇతర సంస్థయినా కూడా భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటని చెబుతున్నాయి. ఈ-గవర్నెన్స్ అంటే ఈజీ, ఎఫెక్టివ్ అండ్ ఎకనమికల్ గవర్నెన్స్. సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి కొత్త శక్తిని ఇచ్చింది. మేం కూడా దానికి తగ్గట్లే డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం'' అని చెప్పారు.