
'ఆ నిందితులను త్వరలోనే పట్టుకుంటాం'
హైదరాబాద్: కీసరలోని మల్లన్నగుడి వద్ద కారుతో సహా ఓ వ్యక్తి దహనమైన కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ రామచంద్రారెడ్డి వెల్లడించారు. కీసర ఘటనాస్థలిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం సంఘనా స్థలాన్ని ఇంఛార్జ్ డీసీపీ రామచంద్రారెడ్డి పరిశీలించారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ అధికారుల నుంచి సమాచారం సేకరించినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామని డీసీపీ తెలిపారు.
కాగా, రంగారెడ్డి జిల్లాలోని కీసరలో కారుతో సహా ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీసరలోని మల్లన్నగుడి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఈ సంఘటన జరిగింది. మృతుడిని నగరానికి చెందిన అడ్వకేట్ ఉదయ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఉదయ్ తిరిగిరాలేదు. దాంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కీసర ఘటనా స్ధలానికి చేరుకున్న ఉదయ్ భార్య జగదీశ్వరి.. కారు తమదేనని, అయితే మృతుని ఒంటిపై ఉన్న దుస్తులు, చెప్పులు మాత్రం తన భర్తవి కావని చెబుతున్నారు. భూ వివాదమే హత్యకు కారణమైంటుందని ఉదయ్ తండ్రి తెలిపారు. (చదవండి: కారు మాదే కానీ, దుస్తులు మా వారివి కావంటున్న కుటుంబ సభ్యులు)