ఆ పాపం నేను చేయను: సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: 'కచ్చితమైన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి చనిపోయాడని ప్రకటించడం పాపం. అలాంటి పాపాన్ని నేను చేయను' అని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. 2014 నుంచి ఇరాక్‌లో కనిపించకుండాపోయిన 39మంది భారతీయుల ఆచూకీ గురించి బుధవారం ఆమె లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ విషయమై లోక్‌సభలో మాట్లాడేందుకు ఇప్పటివరకు మూడుసార్లు సుష్మ ప్రయత్నించినప్పటికీ.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో అది వీలుపడలేదు.
సోమవారం సాయంత్రం, మంగళవారం ఈ విషయమై సభలో ప్రకటన చేసేందుకు సుష్మా ప్రయత్నించారు. అయితే, సభ్యుల ఆందోళన మధ్య అందుకు వీలుపడలేదు. బుధవారం కూడా ఆమె ప్రకటన చేసే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన దిగారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే సభ్యులకు నచ్చజెప్పి శాంతించారు. 2014లో ఇరాక్‌లోని మోసుల్ అపహరణకు గురైన 39మంది భారతీయుల గురించి ఎలాంటి సమాచారం లేదని, వారు చనిపోయారు? బంధీలుగా ఉన్నారా? అన్నదానిపై సమగ్ర ఆధారాలు లేవని సభకు తెలిపారు.