
హింసను వీడితేనే చర్చలు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులు హింసను వీడితే వారితో రాజ్యాంగబద్ధంగా చర్చలు జరిపేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంచేశారు. వామపక్ష తీవ్రవాదం దేశానికి సవాలుగా మారిందని, హింసకు పాల్పడితే ఎవరినైనా సహించేది లేదని చెప్పారు. సోమవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా రాజ్‌నాథ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. అయితే ఎనిమిది గంటల పాటు కొనసాగిన చర్చకు రాజ్‌నాథ్ రెండున్నర గంటల పాటు సమాధానమివ్వడం సభ్యులను అసహనానికి గురిచేసింది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కలుగజేసుకుని ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించినా.. సభ్యులందరి ప్రశ్నలకు జవాబివ్వాలంటూ తన సమాధానం కొనసాగించారు. చివరికి రాత్రి 9.30 గంటలకు రాజ్‌నాథ్ సమాధానం ముగిసింది.