'ట్రావెల్ బ్యాన్ పవర్ విమాన సంస్థకు లేదు'
న్యూఢిల్లీ: విమానంలోగానీ, ఎయిర్‌పోర్ట్‌లోగానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అధికారం సదరు విమానాయాన సంస్థకు లేదని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ అన్నారు. చట్టప్రతినిధులు కూడా పౌరులతోనే సమానం అని వారేదైనా తప్పు చేస్తే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారే తప్ప వారిపై నిషేధం విధించడానికి వీల్లేదన్నారు. గురువారం రాజ్యసభలో ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ ఈ విషయాన్ని గుర్తు చేశారు.
పలు దేశీయ విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో ఉల్లంఘనకు, హింసకు పాల్పడుతున్నారనే కారణంతో ఎయిర్ ఇండియా వంటి పలు విమానాయాన సంస్థలు తమపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయని, అసలు ఆ సంస్థలు అలా చేయొచ్చా అని కురియన్‌ను వివరణ కోరారు. దీనికి స్పందించిన కురియన్.. అగర్వాల్ చాలా విలువైన పాయింట్ లేవనెత్తారని, వాస్తవానికి ఎయిర్ ఇండియా కానీ, మరింకేదైనా విమానయాన సంస్థకు గానీ అలాంటి అధికారం లేదని అన్నారు.
'ఏ ఒక్కరిని శిక్షించే అధికారం ఎయిర్‌లైన్స్‌కు లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే మంచింది. ఏ ఎంపీ అయినా నేరానికి పాల్పడితే చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలిగానీ, విమానాయాన సంస్థకాదు' అని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ జోక్యం చేసుకోని నేరాలనే మాట ఉపయోగించకుండా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ ఉల్లంఘనలు అనే పదం ఉపయోగించాలని కోరారు. అయితే, ఓ వ్యక్తి మరో వ్యక్తిని కొట్టినప్పుడు నేరం అవుతుంది కదా అని వివరణ ఇచ్చారు. ఇటీవల ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అంతకుముందు శివసేన పార్టీ నేతలపై ఎయిర్ ఇండియాతోపాటు పలు విమాన సంస్థలు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.